ఆ ఇద్ద‌రు మంత్రుల‌ను బాబు కంట్రోల్ చేయ‌లేడా?

Update: 2017-02-08 09:01 GMT
ఏపీ కేబినెట్‌ లో భాగ‌స్వామ్యులైన విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు - గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విబేధాలకు ఫుల్ స్టాప్ ప‌డుతున్న‌ట్లుగా కన్పించడం లేదు. ఈ ఇద్ద‌రు మంత్రుల రాజ‌కీయంలో అధికారులు తీవ్రంగా న‌లిగిపోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. తాజాగా జ‌రిగిన విశాఖ ఉత్సవ్ సాక్షిగా ఇది మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. విశాఖ ఉత్స‌వ్ నిర్వహణ‌ను అయ్యన్నను పూర్తిగా విస్మరించడంతో ఈ ఉత్సవ్‌ లో పాల్గొనలేదు. అంతేకాకుండా పనికిమాలిన కార్యక్రమానికి కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సీనియ‌ర్ మంత్రి అయిన అయ్య‌న్నపాత్రుడు త‌న జిల్లాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంపై చేసి వ్యాఖ్య‌లు ఇటు రాజ‌కీయాల్లోనే కాకుండా అటు తెలుగుదేశం పార్టీలోనూ పెద్ద దుమారమే రేపాయి.

విశాఖ ఉత్సవ్‌ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహణకు కొంత మేరకు నిధులు విడుదల చేసింది. అయినా జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. ఉత్సవ్‌ ఏర్పాట్లపై అయ్యన్నకు తెలియజేయకుండానే మంత్రి గంటాతో కలిసి అధికారులు సమీక్షలు నిర్వహించారు. సీనియర్‌ మంత్రినైన తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అయ్యన్న ఎక్కడా చెప్పుకోనప్పటికీ.. తన అనుచరులు మాత్రం మంత్రికి కనీస గౌరవం దక్కలేదన్న బాధ వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే కొంతమంది అధికారులు విశాఖ ఉత్సవ్‌ కు ఆహ్వానించడానికి వెళ్లినప్పటికీ ఉత్సవ్‌ వైపు అయ్యన్న కన్నెత్తి చూడలేదని తెలిసింది. ఇంతవరకు తనకేవిషయం తెలియజేయకుండా చివర్లో పిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత కలెక్టర్‌ యువరాజ్‌ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అయ్యన్నకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రస్తుత కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇవ్వడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అదే స‌మ‌యంలో మంత్రుల వ్యవహారశైలితో అధికారులు నలిగిపోతున్నారు. జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహించడం తప్ప తాము చేయగలిగేది ఏముందని అధికారులు వాపోతున్నారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు- గంట శ్రీ‌నివాసరావు మధ్య రాజకీయ విభేదాలు ఏ స్థాయికివెళ్లినా ఫరవాలేదుగానీ తమ జోలికి రాకుండా ఉంటే చాలని కొంతమంది అధికారులంటున్నారు. మంత్రులిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో వున్న విషయం బహిరంగ రహస్యమైనప్పటికీ ప్ర‌భుత్వం దాన్ని సరిదిద్దే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News