బయట నిద్ర చేయవయ్యా జగనూ... ?

Update: 2021-11-11 09:30 GMT
ఆధునిక రాజకీయాల్లో మంత్రులే రాజులు. కానీ ఒకపుడు రాజులు పాలించేవారు. వారు తమ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మారు వేషాలలో తిరిగేవారు. ఊరు కాని వూళ్లకు వెళ్ళి మరీ అక్కడ అష్టకష్టాలూ కళ్లారా చూసేవారు. దానికి అనుగుణంగా తమ పాలనలో పరిష్కారాలు చూపించి జనం మెప్పు పొందేవారు. మరి నాటి రాజులకూ వేగులు ఎంతో మంది ఉండేవారు. కానీ స్వయంగా చూసి నిర్ధారించుకునేదే నిజం. ఈ సత్యం నమ్మేవారు కాబట్టే నాటి రాజుల పాలన స్వర్ణయుగం అయింది. వర్తమానంలోకి వస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు రాను రానూ ప్రజలకు దూరం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారంతా ఎక్కడో అకాశాన్ని తాకే భవనాల్లో విహరిస్తూ అక్కడ నుంచే పాలన చేస్తున్నారు.

అయితే ఎన్టీయార్ వచ్చాక రాజకీయాల్లో ట్రెండ్ మారింది. ప్రజల వద్దకు పాలన మొదలైంది. కాస్తా తక్కువ ఎక్కువగా అందరూ జనం వద్దకు వస్తున్నారు. వారితో కలసి మెలసి సాగుతున్నారు. ఆ మాటకు వస్తే వైఎస్సార్, చంద్రబాబు, జగన్ ఈ ముగ్గురూ పాదయాత్రీకులు. జనం సాధక బాధకాలను తాముగా చూసి మేలు చేయాలనుకున్న వారు. జగన్ రాజకీయ జీవితాన్నే తీసుకుంటే ఆయన పదేళ్ళ పాటు జనంలోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఆయన రోడ్డు మీదనే ఎక్కువగా కనిపించేవారు. ఇక భారీ పాదయాత్ర రికార్డు అలాగే ఉంది. అటువంటి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం గత రెండున్నరేళ్ళ ఏలుబడిలో జనాలకు కనిపించినది బహు తక్కువ అంటారు.

అయితే ఇందులో ఎంతో కొంత కరోనా మహమ్మారి వాటాగా తీసేసినా పరిస్థితులు కుదుటపడిన ప్రస్తున వేళలలో కూడా జగన్ కేరాఫ్ తాడేపల్లిగానే ఉండిపోవడం మాత్రం విమర్శల పాలు అవుతోంది. జగన్ జిల్లాలకు రావాలీ అంటే ఏదో శుభ కార్యం తమ పార్టీ వారిది ఉండాల్సిందే అంటోంది విపక్షం. ఇక ఇలా వచ్చిన జగన్ అలా వెళ్ళిపోతున్నారు అన్న మాట కూడా ఉంది. నిజానికి ముఖ్యమంత్రి బయటకు వచ్చినపుడు అధికారులతో తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో ముచ్చటించడం ఒక విధానం. దాని వల్ల స్వామి కార్యం, స్వకార్యం కూడా ఈడేరుతాయని అంటారు.

కానీ జగన్ ఒడిషా దాకా వెళ్ళినా కూడా ఒక్క రోజులోనే తిరిగి తాడేపల్లికి చేరుకోవడం మాత్రం విశేషంగానే చూస్తున్నారు. జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వచ్చారు. శ్రీకాకుళం వెళ్లారు, భువనేశ్వర్ వెళ్ళారు. విమాన చక్రాలతో ప్రయాణం కాబట్టి అంతా ఒక్క రోజులోనే సాగిపోయింది. అయితే జగన్ విశాఖలో ఒక రాత్రి అయినా బస చేసి స్థానిక సమస్యల మీద సమీక్ష చేసి ఉంటే బాగుండేది అన్న మాట అయితే వినవస్తోంది. అలాగే ఆయన శ్రీకాకుళం దాకా వెళ్ళారు. అక్కడ రాత్రి బస చేసినా సిక్కోలు సమస్యల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసేందుకు వీలుండేది అంటున్నారు.

పోనీ అధికార కార్యక్రమాలు సమీక్ష పక్కన పెట్టినా పార్టీ నేతలతో అయినా ఆయన ముచ్చటించేందుకు కొంత సమయం ఇచ్చి చూసినా బాగుండేది అన్న చర్చా ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏ జిల్లాకు టూర్ కి వచ్చినా రాత్రి కాకుండానే వచ్చిన విమానంలోనే తిరిగి వెళ్ళిపోతున్నారు అన్నది విపక్షాల విమర్శ అయితే పార్టీలోనూ దాని మీదనే అసంతృప్తి ఉందిట. గతంలో చంద్రబాబు అయితే జిల్లా టూర్లు చెస్తే కచ్చితంగా ప్రభుత్వ అథిధి గృహంలో బస చేసేవారు. ఒక వైపు పార్టీ మీటింగ్స్, మరో వైపు అధికారిక సమీక్షలతో ఆయన రాత్రి అంతా నిద్ర లేకనే గడిపేసేవారు అని గుర్తు చేసుకునే జనాలూ ఉన్నారు. మొత్తానికి పల్లె నిద్రలు అధికారులను చేయమంటున్న జగన్ తాను కూడా బయట నిద్రలను జిల్లా టూర్లలో చేస్తే మరిన్ని సమస్యలు వేగంగా పరిష్కారానికి నోచుకుంటాయని సూచనలు వస్తున్నాయి.
Tags:    

Similar News