తోపు.. తురుంఖాన్ జగన్ పాలనలో ఒకటో తేదీకి జీతాలు రావేం?

Update: 2023-01-21 06:30 GMT
ఎంత పెద్ద ఉద్యోగి అయినా మరెంత చిన్న ఉద్యోగి అయినా.. నెల మొత్తం పని చేసి క్యాలెండర్ లో ఒకటో తేదీ వచ్చే నాటికి బ్యాంకు అకౌంట్లో జీతం పడితే ఆ భరోసానే వేరుగా ఉంటుంది. అందుకు భిన్నంగా క్యాలెండర్ లో ఏదో ఒక రోజు జీతం పడుతుందన్న మాటతో వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. ప్రైవేటు ఉద్యోగులకు ఇలాంటి అనుభవం తరచూ ఎదురవుతుంటే.. వెనుకా ముందు చూసుకోకుండా మరో కంపెనీలోకి మారే ఆలోచన చేస్తారు. కానీ.. అలాంటి పరిస్థితే ప్రభుత్వ ఉద్యోగికి ఉంటే కిందా మీదా పడటం తప్పించి.. మరింకేమీ చేయలేని పరిస్థితి.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్ని ఒకటో తేదీన అందించే అలవాటును పూర్తిగా మానుకున్నారన్న మాట తరచూ ఏపీలోని జగన్ సర్కారు మీద తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధానం అస్సలు అమలు కావటం లేదన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఒకటో తేదీ వచ్చిందంటే జీతాలు రోజుగా ఫిక్సు అయిన వేళ.. అందుకు భిన్నంగా క్యాలెండర్ లో ఒకటో తేదీ వచ్చినా.. జీతాలు.. ఫించన్లు మాత్రం బ్యాంకు ఖాతాలో ఎప్పుడు పడతాయో అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి.

కొత్త సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఒకటో తేదీన రాకుండా ఫర్లేదు. ఏడో తేదీ నాటికి రాకున్నా సర్లేమని సర్దుకున్నా.. ఆంధ్రోళ్ల పెద్ద పండుగ అయిన సంక్రాంతి వచ్చేస్తున్నా.. జీతాలు మాత్రం బ్యాంకు ఖాతాలో జమ కాకపోవటంతో ఉద్యోగులు ఎంతలా ఉక్కిరిబిక్కిరి అయ్యారో తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. ఫించన్లను నెలలో ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై క్లారిటీ తగ్గిపోగా.. ఏపీ చరిత్రలో చూస్తే.. ఒక దశలో నెల చివర్లో అంటే.. తర్వాతి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలు.. ముందు నెల ఆఖరి పని దినమైన 30 కానీ 31 తేదీన పడేలా పరిస్థితి ఉండేదని చెబుతున్నారు.

ఈ తరహా పరిస్థితి 1977లోనే ఉండేదని.. దీనికి అనువుగా ఉండేందుకు జీవోను కూడా తీసుకొచ్చినట్లుగా గతాన్ని పలువురు ఉద్యోగులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలా నెల చివరి రోజున జీతాలు తీసుకునే దానిని 1990లో చిన్న మార్పు చేసి.. నెల జీతాన్ని తర్వాతి నెల మొదటి రోజైన ఒకటో తేదీన చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొత్త జీవోను 1990 ఏప్రిల్ 17న జీవోనెంబరు 223ను జారీ చేశారు. ఎందుకిలా అంటే.. జీతాల్ని నెల చివరి రోజున చెల్లించే నేపథ్యంలో చివరి రోజు లావాదేవీలు తర్వాతి నెలకు బదిలీ కావటం.. సాంకేతికంగా తలనొప్పులు రావటంతో అలాంటిదేమీ లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించేలా ఏర్పాట్లు చేశారు.

గతమెంత ఘన కీర్తి అన్న నానుడికి తగ్గట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. ఫించన్లు ఠంఛనుగా ఒకటో తేదీన పడే దానికి భిన్నంగా ఇప్పుడు అప్పు పుట్టినప్పుడే జీతాలు ఖాతాల్లోకి పడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు ఓవర్ డ్రాఫ్టు ఇతర వెసులుబాట్లు వినియోగించుకున్నప్పటికీ జీతాలు.. పింఛన్ల సొమ్ములకు సరిపోకపోవటంతో.. బహిరంగ మార్కెట్ రుణాలకు కేంద్రం నుంచి అనుమతులు ఉంటే.. అవి సకాలంలో అందితే తప్పించి జీతాలు చెల్లించే పరిస్థితి.

ఒకవేళ.. అప్పు పుట్టని పరిస్థితుల్లో జీతాలు చెల్లించే పరిస్థితి లేదని చెబుతున్నారు. బటన్ నొక్కేసి.. వివిధ సంక్షేమ పథకాల్ని అమలుచేసే ముఖ్యమంత్రి జగన్ హయాంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎప్పుడు చేతికి చేరుతాయో తెలీని పరిస్థితి ఎందుకు ఉన్నట్లు? తోపు ముఖ్యమంత్రిగా కీర్తించే వైసీపీ నేతలు.. జీతాలు ఒకటోతేదీన జగన్ సర్కారు ఎందుకు ఇవ్వలేకపోతుందన్న ప్రశ్నకు సమాధానం ఏం చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News