దేవుడికి వరమిచ్చిన కేసీఆర్.. ఏంటో తెలుసా?

Update: 2019-05-19 11:13 GMT
సాధారణంగా భక్తులు కోరుతారు.. దేవుడు వరమిస్తాడు.. కానీ ఇప్పుడు ఆ దేవుళ్లకే వరాలిచ్చే స్థితిలో మన రాజకీయ నాయకులున్నారు. యాదాద్రిని వందల కోట్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక దక్షిణ కాశీ వేములవాడకు ప్రతీ ఏటా 100 కోట్లు ఇస్తూ అభివృద్ధి పరుస్తున్నారు. తాజాగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామికి కూడా కేసీఆర్ వరాలిచ్చాఢు.

గోదావరి నదీతీరాన ఉన్న కాళేశ్వర క్షేత్రాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా.. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల నిధులను కేటాయించనున్నట్టు సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కేసీఆర్ అక్కడ కాళేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో కాళేశ్వర ఆలయాన్ని, కాళేశ్వర ప్రాంతాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని కేసీఆర్ పేర్కొన్నారు.

కాళేశ్వరం ఆలయ విస్తరణకు 600 ఎకరాల స్థలం సేకరించాలని  కలెక్టర్ ను  కేసీఆర్ ఆదేశించారు. యగ్న యాగాదులకు కాళేశ్వరం అనువుగా ఉంటుందని.. శృంగేరి పీఠాధిపతితో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒకప్పుడు గోదావరి తీరం ఉన్న రామగుండంలో నీటి జాడ లేక వాగులో నాణేలు జారవిడిచానని.. ఇప్పుడు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వరకూ నీటి జాడ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉంటుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇలా వరుసగా దేవుళ్లకు వరాలిస్తూ కేసీఆర్ సంచలనం సృష్టిస్తున్నారు. తెలంగాణలో అశేష చరిత్ర ఉండే ఆదరణ లేకున్నా పురాతన ఆలయాల ప్రభ కేసీఆర్ హయాంలో తిరిగి వెలుగులోకి వస్తుండడం విశేషం.


Tags:    

Similar News