సెమీఫైన‌ల్స్ కాంగ్రెస్‌ - బీజేపీల‌కు చెప్తున్న పాఠం

Update: 2018-12-12 04:58 GMT
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తున్నాయి. గత లోక్‌ సభ ఎన్నికలతోపాటు ఆ తరువాత జరిగిన ప‌లు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న బీజేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికలు బ్రేకులు వేశాయి. ఇంతవరకు విజయాలు మాత్రమే చూసిన ప్రధాని మోడీ - అమిత్‌ షా ద్వయానికి ఓటమిని రుచి చూపించాయి.  అదే సమయంలో బలమైన - వ్యూహాత్మకమైన కూటములతో పటిష్ఠమైన కాషాయ కోటను బద్దలుకొట్టవచ్చని నిరూపించాయి. గత లోక్‌ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం - అనంతరం పంజాబ్ మినహా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూవిచూసిన నేపథ్యంలో ఆత్మస్థయిర్యం కోల్పోయి తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో రాజస్థాన్ - ఛత్తీస్‌ గఢ్ - మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కొత్త ఆశలను రేకెత్తించాయి. లోక్‌ సభ ఎన్నికల కోసం పునరుత్తేజం పొందేందుకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. పార్టీపై పట్టు సాధించేందుకు అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి మరింత బలాన్నిచ్చాయి. వరుస పరాజయాలతో ప్రాంతీయ పార్టీలకు సైతం లోకువైన స్థితిలో ఈ ఫలితాలు కూటమిలో పెద్దన్న పాత్రను పోషించే అవకాశాన్ని కల్పించాయి మరో ఆరు నెలల్లో లోక్‌ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార బీజేపీకి ఇటు ప్రతిపక్ష పార్టీలకు అనేక గుణపాఠాలు నేర్పించాయి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 1. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న నిరాశా నిస్పృహలు ఓటింగ్ సరళిని ప్రభావితం చేయటం. 2. మతం ప్రాతిపదికన విభజన రాజకీయాలతో ఓట్లు పడకపోవటం. 3. బలమైన - వ్యూహాత్మకమైన ప్రతిపక్ష కూటమితో బీజేపీని ఓడించవచ్చు అనేది రుజువు కావటం.

దేశవ్యాప్తంగా రైతులు గిట్టుబాటు ధరలు లేక - వాతావరణ మార్పులతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని - విత్తనాలను ఉచితంగా అందజేయడంతో రైతులు కొంత ఊరట పొందారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. టీఆర్ ఎస్ పట్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సానుకూలత కారణంగానే ఆ పార్టీ తెలంగాణలో తిరిగి అధికారానికి వచ్చిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రజలలో వచ్చిన వ్యతిరేకత కారణంగా మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఛత్తీస్‌ గఢ్‌లో బీజేపీ - మిజోరంలో కాంగ్రెస్ ఓటమిని చవిచూసినట్టు చెప్తున్నారు. వ్యవసాయం బాగా వృద్ధిలో ఉన్న మధ్యప్రదేశ్‌ లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ మంద్‌ సౌర్‌ లో రైతులపై జరిగిన కాల్పులు ఆయనకు మచ్చ తెచ్చిపెట్టాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ఓటర్లలో కొన్ని వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే పతనం తప్పదు అని ఈ ఎన్నికల ఫలితాలు రాష్ర్టాలకు - కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి.

ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ కు జవసత్వాలను అందించాయి. గత నాలుగున్నరేళ్లుగా ఆ పార్టీ ఓటమికి అలవాటు పడటంతో కార్యకర్తలు నిర్వేదానికి గురయ్యారు. గుజరాత్‌ లో గెలుపు అంచుల వరకూ వచ్చి బోల్తా పడింది. అనేక చోట్ల గట్టి పోటీనిచ్చినప్పటికీ వాటిని విజయాలుగా మార్చుకోలేకపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోవచ్చు. మూడు పెద్ద రాష్ర్టాల్లో లభించిన అధికారం ఆ పార్టీకి ఇతర వనరులను కూడా సమకూర్చవచ్చు. రెండోది - మోడీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమికి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధాన నాయకునిగా కనిపిస్తున్నారు. ఏడాది క్రితం డిసెంబర్ 11న పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ మూడు రాష్ర్టాల్లో పార్టీని తిరిగి అధికారానికి తేవడం ద్వారా తనపై ఉన్న పప్పూ - అసమర్థుడు అన్న ముద్రను చెరిపేసుకోగలిగారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే అంశాలు కీలక పాత్ర పోషించాయో పార్టీలు గమనించి ఉంటాయి. వాటి ఆధారంగానే 2019కి వ్యూహాలు రచిస్తూ సమాయత్తవుతాయి. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే తప్ప బలమైన బీజేపీని ఎదుర్కోలేవని ఈ ఎన్నికలు నిరూపించాయి. మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్‌ లో బీఎస్పీ కాంగ్రెస్‌ తో జతకట్టి ఉంటే వాటి బలం మరింత పెరిగి ఉండేది. కానీ మధ్యప్రదేశ్‌ లో ఒంటరిపోరు - ఛత్తీస్‌ గఢ్‌ లో అజిత్ జోగి పార్టీతో జతకట్టడం బీఎస్పీని నష్టం చేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల భేటీకి దూరంగా ఉన్న మాయావతి - అఖిలేశ్ యాదవ్‌ ను కూటమిలో చేర్చుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నించవచ్చు. కేంద్రంలోని అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో అసంతృప్తి రగులుకుంటోంది. ఇప్పటికే ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని ఆర్ ఎస్ ఎల్‌ పీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. మరో పార్టీ శివసేన బెదిరింపులకు దిగుతోంది.

   

Tags:    

Similar News