కాంగ్రెస్ - జేడీఎస్‌ లను వీడని బీజేపీ భయం

Update: 2018-05-20 07:51 GMT
తొలిసారి బీజేపీ రాజకీయాలను సమర్థంగా ఎదుర్కొని కర్ణాటకను ఆ పార్టీ పరం కాకుండా అడ్డుకోగలిగిన కాంగ్రెస్‌ కు - కాంగ్రెస్‌తో జత కట్టి కర్ణాటకలో అధికారం అందుకుంటున్న జేడీఎస్‌ కు ఇంకా భయం మాత్రం పోలేదట. బీజేపీ ఏ క్షణాన్నైనా తమ ఎమ్మెల్యేలను లాక్కుని తమను అధికారం వరకు వెళ్లకుండా చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాయట. అందుకే.. కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో కొలువుదీరే వరకు కూడా ఎమ్మెల్యేలను బయటకు వదలడం లేదట. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చినా కూడా వారిని తమ అదుపాజ్ఞల్లోనే ఇంకా ఉంచినట్లు తెలుస్తోంది.
    
ఒకప్పటి 'ఆపరేషన్ లోటస్' భయం రెండు పార్టీలనూ వెంటాడుతుండడంతో ఎమ్మెల్యేలను ఇంకా శిబిరాల్లోనే ఉంచారు. ప్రస్తుతం హిల్టన్ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - లీ మెరీడియన్ హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి అవసరమైన సమస్త సౌకర్యాలనూ పార్టీ పెద్దలు హోటల్స్ లోనే సమకూరుస్తున్నారు.కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి - మంత్రివర్గ కూర్పు - ఆపై బలనిరూపణ ముగిసిన తరువాతే ఎమ్మెల్యేలను బయటకు వదలాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
    
మరోవైపు కాంగ్రెస్ నేతల్లో ముఖ్యులందరికీ పదవులిచ్చి సంతృప్తిపరిచి భవిష్యత్తులో వారితో ఇబ్బంది లేకుండా ఉండేలా కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 20 మంత్రి పదవులను ఇవ్వడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత జీ పరమేశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారని సమాచారం. మొత్తం 30 మంది మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి - ఆ తరువాత వీలును బట్టి మంత్రివర్గాన్ని విస్తరించాలన్న యోచనలో ఉన్నట్టు జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. తమకు మద్దతుగా నిలిచిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని కుమారస్వామి భావిస్తున్నారట. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు రెండున్నరేళ్లు సీఎం సీటు ఇవ్వడానికి ఒప్పుకొన్నాకే మిగతా లెక్కలు చూద్దామంటున్నారట.
Tags:    

Similar News