కేసీఆర్ నిజ‌స్వ‌రూపం ఇది...

Update: 2015-09-19 05:21 GMT

Full View
తెలంగాణ ముఖ్య‌మంత్రిపై అదును దొరికిన‌ప్పుడల్లా తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. సంద‌ర్భం ఏదైనా ఆయ‌న టార్గెట్‌ గా విరుచుకుప‌డుతున్నాయి. తాజాగా తెలంగాణ‌లో ఉద్య‌మాల పురిటిగ‌డ్డ అయిన‌ ఉస్మానియా యూనివర్సిటీ  కేంద్రంగా ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు నిప్పులు చెరిగారు.

ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని హాస్టళ్లు, మెస్‌ లు బాగాలేవ‌ని, వాటిని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ వార్త‌లు వెలువ‌డ్డాయి.  వీటిని పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతలు కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దుర్బరపరిస్థితులు ఓయూలో నెలకొన్నాయని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఒకప్పుడు డైమండ్‌ లా ఉన్న వర్సిటీలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయా అన్న బాధ క‌లుగుతోంద‌ని తెలిపారు. పరిస్థితి చూస్తే బాధతో పాటు ఏడుపు వస్తోంద‌ని, ఇంతటి దుర్భరపరిస్థితులు చూశాకా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందా అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్‌.. 5 నిముషాలు ఓయూ హాస్టల్‌ గదిలో ఉండు, పరిస్థితేమిటో తెలుస్తుంది’ అని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఓయూ విద్యార్థుల మెస్‌ బకాయీలు రూ.7 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేశారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మెడలు వంచైనా సరే, ఓయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఓయూకు దూరం చేసేందుకు కేసీఆర్‌ సర్కారు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పరిశీలన అనంతరం ఓల్డ్‌ పీజీ హాస్టల్‌ మెస్‌ లో వారంతా భోజనం చేశారు.

మరోవైపు.. కేసీఆర్ అంటే అంతెత్తున లేచే టీడీపీ నేత మోత్కుపల్లి న‌ర్సింహులు సైతం కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఉస్మానియా విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ కనీసం తిండి, నీళ్లు కూడా ఇవ్వట్లేదని  అన్నారు. ‘‘కేసీఆర్‌ దొంగ అని నాలుగేళ్ల నుంచి నేను మొత్తుకుంటున్నా ఎవరూ వినలేదు. ఇప్పుడు ఆయన నిజస్వరూపం తెలుసుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓయూ విద్యార్థులు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక జారీచేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎంతకైనా తెగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
Tags:    

Similar News