కాంగ్రెస్ పార్టీ అతి మ‌రీ దారుణం బాస్‌

Update: 2016-01-10 07:52 GMT
గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను చావో రేవో అన్న‌ట్లుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందివ‌చ్చిన అవ‌కాశంతో అంద‌లం ఎక్కాల్సింది పోయి అన‌వ‌స‌ర ఆర్భాటాల‌కు పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ ఎస్ చేప‌ట్టిన‌ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేత‌లు గులాబీ గూటికి చేరిపోయారు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్న నేత‌లు పార్టీలోనే ఉన్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో త‌మ ల‌క్‌ ను ప‌రీక్షించుకోవాల‌ని వారు టీపీసీసీకి ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించుకున్నారు.

ఇలా సొంత శ్రేణుల నుంచి వ‌చ్చిన ద‌రఖాస్తుల విష‌యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు ఒకింత అతి చేస్తున్నార‌ని నాయ‌కులు అంటున్నారు. ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన వివ‌రాలు కాంగ్రెస్ పెద్ద‌లు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్ప‌గించారు. ఈ సంస్థ ఆయా డివిజన్ల వ‌ద్ద‌కు వెళ్లి ఎవ‌రికి ప్ర‌జ‌ల్లో ప‌ట్టు ఉందో తెలుసుకునేందుకు స‌ర్వే నిర్వ‌హించ‌నుంద‌ట‌. ఈ ప్ర‌క్రియ‌పై నాయ‌కులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఎవ‌రు ప‌నిచేశారో, ఎవ‌రు పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నారో తెలియ‌కుంటే అగ్ర‌నేత‌ల అవ‌గాహ‌న స్థాయి ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ప్రైవేటు ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా త‌మ సామ‌ర్థ్యాల‌ను అంచ‌నా వేయ‌డం అంటే అది క‌చ్చితంగా అవ‌మానించిన‌ట్లే అవుతుంద‌ని మండిప‌డుతున్నారు.

పార్టీ నేత‌లు త‌మ‌లో ఎవ‌రికో ఒక‌రికి టిక్కెటు ఇచ్చి స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసుకోవాల‌ని సూచిస్తే బావుండ‌దా అంటూ కాబోయే కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా నేత‌లుగా ఎవ‌రైనా గౌర‌విస్తార‌ని... ప్రైవేటు సంస్థ అభిప్రాయం ఆధారంగా టిక్కెట్టు ద‌క్క‌ని నాయ‌కులు పార్టీ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌రా అంటూ మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెడుతున్నారు. అగ్ర‌నేత‌లు నాయ‌కుల‌కు న్యాయం చేయాల్సింది పోయి ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స్వీయ ప‌రాభ‌వానికి దారితీస్తుంద‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News