అక్కడ కాంగ్రెస్... ఇక్కడ టీడీపీ... ?

Update: 2021-08-27 13:30 GMT
ఎన్నికలు మరో రెండున్నరేళ్ల దాకా జరగవు. కానీ అపుడే తొందరపడి టీడీపీ తమ్ముళ్ళ కోయిలలు కూస్తున్నాయి. ఏకంగా సోషల్ మీడియాలో వారు జోస్యాలు కూడా చెబుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రాలో టీడీపీ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో  అధికారంలోకి రావడం ఖాయమని కూడా అంటున్నారు. అంటే ఒకనాటి టేడీపీ తమ్ముడు రేవంత్ రెడ్డి తెలంగాణాలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కావాలన్న మాట. అదే సమయంలో ఏపీలో జగన్ గద్దె దిగిపోయి చంద్రబాబు మరొమారు సీఎం అవుతారన్న మాట. అంటే తెలంగాణాలో తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం. మొత్తానికి రెండు దశాబ్దాల తరువాత అంటే  2004 తరువాత ఉమ్మడి ఏపీ అలా బాబు అనుకూలంగా మారుతుంది అని తమ్ముళ్ళు చాలా పెద్ద కలలే కంటున్నారు.

ఇక్కడ చంద్రబాబుకు కేసీఆర్ జగన్ ఇద్దరూ రాజకీయ విరోధులే. ఎందుకంటే జగన్ని ఏపీలో సీఎంగా చూడాలని కేసీయార్ గట్టిగానే  భావించారు. దానికి తగిన విధంగా కేసీఆర్ ఎంతో సాయం చేశారని బాబు అనుమానం. అదే విధంగా ఓటుకు నోటు కేసు తరువాత తనకు ఎన్ని చిక్కులు తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎదురయ్యాయో కూడా తలచుకుని చంద్రబాబు ఆవేదన చెందని రోజు కూడా లేదుగా. అదే కనుక జరగకపోయి ఉంటే ఈపాటికి తెలంగాణాలో చంద్రబాబు జోరు మరోలా ఉండేది. అందువల్ల బాబు ఆలోచనలు చూస్తే కేసీఆర్, జగన్ ఇద్దరూ వద్దు అన్నదే ఆలోచన.

ఏపీలో తాను గెలిచినా తెలంగాణాలో కేసీఆర్ మళ్ళీ వస్తే తనకు చికాకులు తప్పవని గ్రహించే బాబే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపారని ఇప్పటికే ప్రచారం ఉంది. ఇపుడు తమ్ముళ్ళు జోస్యాలు బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఇక ఇక్కడ తమ్ముళ్ళు బయటకు చెప్పుకోలేనిది... బాబు ఆదేశాల ప్రకారం బయట పడని జోస్యం మరోటి కూడా ఉందిట. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కూడా మోడీ దిగిపోయి కాంగ్రెస్ నాయకత్వన విపక్ష  కూటమి పవర్ లోకి  వస్తుందన్న ఆశ ఉందని చెబుతున్నారు.

అంటే ఇపుడున్న ముగ్గురూ దిగిపోయి పూర్తిగా బాబుకు అనుకూలంగా జాతీయ స్థాయిలోనూ, ఏపీలోనూ, తెలంగాణాలోనూ రాజకీయాలు మారిపోతాయని అనుకుంటున్నారు అన్న మాట. నిజంగా అదే జరిగితే చంద్రబాబు పులి అయిపోరూ. ఆయన రాజకీయం మళ్ళీ 1995 నాటి మాదిరిగా ధాటీగా మారిపోదూ. కానీ ఇదంతా తమ్ముళ్ళ ఆశ. చంద్రబాబు ఆరాటం. ఎవరైనా తమకు అనుకూలంగానే జరగాలని కోరుకుంటారు. కానీ దేశంలోనూ తెలుగు రాష్ట్రాలలోనూ  రాజకీయం ఇపుడు అలా ఉందా లేదా అన్నదే చూడాలి మరి. ఏదేమైనా తెలుగు త‌మ్మ‌ళ్ల ఆలోచ‌న‌లు ప‌గ‌టి క‌ల‌ల‌ను మించి పోతున్నాయి.
Tags:    

Similar News