కరోనా అలర్ట్ : 209 కి చేరిన భాదితుల సంఖ్య ...ఒక్కరోజే 33 పాజిటివ్ కేసులు !

Update: 2020-03-20 07:30 GMT
ఉరుముల్లేని పిడుగులా కరోనా మహమ్మారి ప్రపంచదేశాల పై విరుచుకుపడుతోంది. ప్రాణాంతక వైరస్‌ ను నిరోధించడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా  తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రజలను ఇళ్లు దాటి బయటకు రావద్దని, పరిశుభత్ర పాటించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. కరోనా కి మందు లేకపోవడంతో రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే  కొత్తరకం ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం 117 దేశాలకు వ్యాపించింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు 10,000 మందికిపైగా మృతిచెందగా, వైరస్ సోకినవారి సంఖ్య 2,45,600 దాటింది.

ఇకపోతే ఈ కరోనా వైరస్  భారత్ లో కూడా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు భారతదేశం లో మొత్తం 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కోటి, ఇతర రాష్ట్రాల్లో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఉదయం వరకు 197గా ఉన్న బాధితుల సంఖ్య ప్రస్తుతం 209కి చేరింది.ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్‌ కారణంగా ఐదుగురు మృతి చెందారు. నిన్నటి వరకు నలుగురు చనిపోగా తాజాగా నేడు మరొకరు కరోనా కారణంగా మృతి చెందారు. ఇకపోతే  మహారాష్ట్రలో అత్యధికంగా52 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా  కేసుల సంఖ్య 16కు చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. శుక్రవారం కరోనా పరిస్థితిపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  అలాగే తాజాగా దేశంలో ఐదో కరోనా మరణం చోటుచేసుకున్నట్టు తెలిపింది. 

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టగా చైనా వెలుపలే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌, జర్మనీ దేశాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండగా, ఈ దేశాల్లో భారతీయులు ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నాలుగు దేశాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రవాసభారతీయులు ఉన్నట్లు అంచనా.  భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆందోళన పెరిగిపోతుంది. ఇక దేశంలో రోజురోజుకి కరోనా భాదితులు పెరిగిపోతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా మార్చి 29 వరకు కేంద్రం రద్దుచేసింది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారికీ కరోనా పాజిటివ్ అని వస్తుండటం తో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే  కరోనా వైరస్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే తొలిసారి భక్తులను దర్శనానికి అనుమతి నిరాకరించారు. ఆలయంలోని శుక్రవారం నుంచి భక్తులను అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది.

Tags:    

Similar News