జపాన్ ను వణికిస్తోన్న కరోనా ఫోర్త్ వేవ్ .. ఆ 9 నగరాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ !

Update: 2021-05-27 05:30 GMT
ప్రపంచంలో  పలు దేశాల్లో కరోనా అదుపులోకి వస్తుంటే , అలాగే ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌ లోనూ వైరస్‌ తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగో వేవ్‌ భయంతో జపాన్‌ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్‌ వేడుకలకు సన్నద్ధం అవుతున్న సమయంలో వైరస్‌ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో జపాన్‌ లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లోనూ హెల్త్‌ ఎమర్జెన్సీ ని ప్రకటించాయి.ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృతంగా పంపిణీ కొనసాగడంతో కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ, ఇన్నిరోజులు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగిన జపాన్‌ లో మళ్లీ కరోనా విజృంభణ ఆందోళనకి గురిచేస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ ఫోర్త్‌ వేవ్‌ ధాటికి ఒసాకా అల్లాడిపోతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. ఈ వారంలో 3849 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా జపాన్‌ లో సంభవిస్తోన్న కరోనా వైరస్ మరణాలు దాదాపు 25శాతం ఆ ఒక్క నగరంలోనే ఉంటున్నాయి.  ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 96శాతం పడకలు కొవిడ్‌ బాధితులతో నిండిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపిస్తుండడంతో కోలుకోవడం ఇబ్బందిగా మారినట్లు అక్కడి వైద్యులు చెప్తున్నారు. ఇలా ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఒసాకా నగరంలో ఈ నెలలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీనికి బ్రిటన్‌ లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వైరస్‌ కారణం అయిఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. గతకొద్ది రోజులుగా పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్న వారిలో 14శాతం ఆసుపత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. ఇక టోక్యోలోనూ కరోనా వైరస్ బాధితుల్లో 37శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం ఇబ్బందికరంగా మారిందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో ఔషధాలు, వెంటిలేటర్ల కొరత ఎక్కువ కావడంతో పాటు రోగుల తాకిడిని తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న వైద్యులు, నర్సులు సరిపోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనితో పలు దేశాలు ఇప్పట్లో జపాన్ వెళ్లే ఆలోచనలు వాయిదా వేసుకోవాలని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
Tags:    

Similar News