వైట్ హౌస్ లోకి చొచ్చుకెళ్లిన కరోనా

Update: 2020-03-21 05:30 GMT
కరోనా కాదు.. చైనీస్ వైరస్ అంటూ అదే పనిగా చైనా మీదీ విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ ఆఫీసుగా చెప్పే వైట్ హౌస్ లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక్కడ పని చేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని కన్పర్మ్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఎంతసేపూ కరోనా వైరస్ కు కారణం చైనా అంటూ ఆ దేశాన్ని నిందించటమే తప్పించి.. దాని ప్రభావం అమెరికా మీద ఉండకుండా చేయటంలో ట్రంప్ ఎంతలా ఫెయిల్ అయ్యారన్నది.. తాజాగా వెల్లడవుతున్న గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థ మైపోతాయి.

గడిచిన యాభై గంటల్లో ఏకంగా పదివేల కొత్త కేసులు నమోదు కావటం చూస్తే.. అమెరికాలో ఎంతటి భయానక పరిస్థితి ఉందో ఇట్టే అర్థమైపోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 18వేలను దాటింది. ఇప్పటికే.. కరోనాను జాతీయ అత్యయిక స్థితిగా ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుల వారు ఉండే వైట్ హౌస్ లో పని చేసే ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో.. వైట్ హౌస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాకుంటే.. కరోనా పాజిటివ్ అయిన వ్యక్తి నేరుగా అధ్యక్షుల వారిని కలిసే అవకాశం లేదని చెబుతున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ టీంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు చెబుతున్నారు.

తాజా పరిణామంతో వైట్ హౌస్ సిబ్బంది ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక.. వైట్ హౌస్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు సీటింగ్ ఏర్పాట్లలో మార్పులు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం దూరం.. దూరంగా ఉద్యోగుల సీటింగ్ ను మారుస్తున్నారు. అత్యంత భద్రతా పరమైన ఏర్పాట్లు ఉంటే వైట్ హౌస్ లో పని చేసే ఉద్యోగికి కరోనా బారిన పడటంతో వైట్ హౌస్ లో ఆందోళన వ్యక్తమవుతుందంటున్నారు. కంటికి కనిపించని ఈ వైరస్ తో అమెరికా మరింత తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాజా పరిణామం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News