తిరుపతిలో కరోనా కలకలం..ఆందోళనలో శ్రీవారి భక్తులు!

Update: 2020-03-03 12:38 GMT
ఎక్కడో చైనాలోని వూహన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ - ఎన్నో సముద్రాలు దాటుకుంటూ తెలుగు రాష్ట్రాలకి కూడా చేరింది. చైనాలో ఈ వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది అని తెలుసుకున్న రోజు నుండి ఆ వైరస్ ఎప్పుడు ఇక్కడికి వస్తుందో , ఆ వైరస్ భారిన పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంటూ నానా హుంగామ చేసారు. ఇక ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టే ఆ కరోనా వైరస్ మన దేశంలోకి , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోకి ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా హైదరాబాద్ లో ఒక వ్యక్తికీ కరోనా రిపోర్ట్ పాజిటివ్ గా రావడంతో - గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్‌ కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం ఆ వ్యక్తి భారత్‌ కు  రాగా - కరోనా లక్షణాలతో  రుయా ఆసుపత్రిలో చేరాడు.   అత‌ని ర‌క్త న‌మూనాల‌ను సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి రుయా వైద్యులు పంపారు. అయితే తైవాన్ వాసికి క‌రోనా నెగిటివ్ అని రావ‌డంతో రుయా వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంగ‌ళ‌వారం అత‌న్ని డిశ్చార్జి చేశారు.

అయితే , ఆ తిరుమలేశుని దర్శనం కోసం నిత్యం లక్షల్లో తిరుపతికి వస్తుంటారు. వారిలో పొరుగు రాష్ట్రాల వారు , పొరుగు దేశాల వారు కూడా ఉంటారు. వారు ఎక్కడినుండి వస్తున్నారు, అక్కడి  వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఏంటో  తెలుసుకోవడం చాలాకష్టం. దీనితో కరోనా వైర‌స్ ప్ర‌మాదం ఎప్పుడు - ఎక్క‌డ - ఎవ‌రి నుంచి ముంచుకొస్తుందోన‌నే భ‌యం తిరుప‌తి వాసులని - ఆ శ్రీవారి భక్తులని వెంటాడుతోంది. అందుకే ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి వెళ్లేందుకు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిన ప‌రిస్థితి. అందులోనూ మాస్క్‌లు ధ‌రించే అల‌వాటు జ‌నానికి పెద్ద లేక‌పోవ‌డం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో జనాలు భయపడుతున్నారు.
Tags:    

Similar News