మోడీ, బాబు టూర్ల‌తో రాజ‌ధాని క‌ట్టేయ‌చ్చు!

Update: 2017-07-21 07:21 GMT
రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఎన్నిక పూర్త‌యిపోవ‌డం - ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి బ‌రిలో తెలుగువ్య‌క్తి అయిన బీజేపీ సీనియ‌ర్ నేత ఎం.వెంక‌య్య‌నాయుడు నిలిచిన నేప‌థ్యంలో అంద‌రి చూపు ఈ ఉన్న‌త ప‌ద‌వుల‌పై ప‌డింది. త‌న వాగ్దాటితో అంద‌రిని ఆక‌ట్టుకున్న వెంక‌య్య‌నాయుడు ఈ ప‌ద‌వికి పోటీప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామంపై సీపీఎం ఏపీ కార్యదర్శి  మధు ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఎన్‌ డీఏ త‌ర‌ఫున  రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో దిగి దేశ‌ప్ర‌థ‌మ పౌరుడి ప‌ద‌వికి ఎన్నికైన రామ్‌ నాథ్ కోవింద్ ఎక్కువగా మాట్లాడరని, ఉపరాష్టప్రతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎక్కువగా మాట్లాడినా చేసేది ఏమీలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలంకార‌మైన ప‌ద‌వికి తెలుగువ్య‌క్తి ఎంపిక అవుతున్నార‌ని మ‌ధు అన్నారు. బీజేపీ త‌న ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో భాగంగానే ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను ఎంపిక చేసింద‌ని విశ్లేషించారు.

కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలు ద‌ళితుల విష‌యంలో దురుద్దేశపూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని మ‌ధు మండిప‌డ్డారు. దళితులు తమకు ఓట్లు వేయలేదు - ఇకపై ఓట్లు వేస్తారన్న నమ్మకంలేదు కనుకే రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, వివక్ష పెరిగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నేడు రాష్ట్రంలో పెరుగుతున్న ప్రభుత్వ ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లుపైకి రావడం ఆనందంగా ఉందని, ఇది కమ్యూనిస్టులకు మంచి రోజులుగా మధు అభివర్ణించారు. పోరాటాలపైన ఆధారపడే కమ్యూనిస్టుల అభివృద్ధి ఉంటుందన్న ఆయన 2019 ఎన్నికల్లో తాము ఎన్ని సీట్లు గెలుచుకుంటామో చెప్పలేం కాని భవిష్యత్తులో కమ్యూనిస్టులే కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. కమ్యూనిస్టులు సొంత బలం పెంచుకుంటే తప్ప బీజేపీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. విదేశీ పర్యటనలకు ప్రధాని మోడీ - సీఎం చంద్రబాబు నాయుడులు చేసిన ఖర్చుతో రాష్ట్ర రాజధానిని నిర్మించవచ్చని ఆయన అన్నారు.

బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలతో ప్రజలు, కార్మికులు రోడ్లపైకి వస్తున్నారని, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే జీఎస్టీని నిరసిస్తూ వ్యాపారులు సైతం నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నార‌ని మ‌ధు అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని అతిథిగృహాల్లో 10వ తరగతి చదువుకున్న వారు పనిచేయకూడదని, డిగ్రీ చదువుకున్నవారే ఉండాలంటూ పనిచేస్తున్నవారిని తొలగించడం దారుణమన్నారు. వెంటనే తొలగించిన కార్మికులను తిరిగి పనుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు ఎక్కడా స్థలం కాని, ఇల్లు కాని ఇచ్చిన దాఖలాల్లేవనిన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గరిగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ, ప్రకాశం జిల్లా పరుచూరులో 200 ఎకరాలు దళితుల భూముల్లో నీరు-చెట్టు కింద చెరువులు తవ్వడం దారుణమన్నారు. దళిత జడ్పీటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ లు ఉన్నా వారి మాటలకు విలువలేకండా పోయిందని, అంతా జన్మభూమి కమిటీలు చెప్పినట్లు చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో మహాభారతంలో కులవివక్షను రూపు మాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఈనెల 31న చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు.
Tags:    

Similar News