నిన్నటి నేస్తం నిప్పులు : పవన్ మీద మరీ అంత కోపమా...?

Update: 2022-06-06 15:30 GMT
పవన్ కళ్యాణ్ ఎనిమిదేళ్ళ రాజకీయ జీవితంలో చాలా మందితో చెట్టాపట్టాలు వేశారు. తనది  రాజకీయాలలో మచ్చలేని బాట, ఒక రకమైన రాచబాట అని కూడా నమ్ముతున్నారు. ఇక ఆయన దోస్తీలు లెక్కలు కూడా ఉన్నాయి అంటారు. ఆయన పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా ఒకనాటి మిత్రులు బీజేపీ టీడీపీలతోనే మళ్లీ సెటిల్ అయ్యేందుకు చూస్తున్నారు. మరి ఈ మధ్యలో స్నేహాలు, ఎర్రెర్రని కబుర్లు చెప్పుకున్న వైనాలు అన్నీ తలచుకుని నిన్నటి నేస్తం సీపీఎం సీనియర్ నాయకుడు పి మధు  పవన్ మీద ఎగిరెగిరిపడుతున్నారు.

ఆయన  పవన్ మీద ఎప్పుడూ చెప్పని మాటలను కూడా ఇపుడు చెబుతున్నారు. మాతో 2019 ఎన్నికల వేళ పొత్తు పెట్టుకున్న పవన్ సడెన్ గా మాతో చెప్పకుడా బీఎస్పీతో చెలిమి చేసి ఆ పార్టీని కూటమిలోకి తెచ్చారు అంటూ పాత విషయాన్ని కొత్తగా చెప్పారు. నాడు పొత్తు ధర్మాన్ని పవన్ విస్మరించారు అని ఆయన ఇపుడు ఆరోపిస్తున్నారు.

ఇక తమతో పొత్తు పెట్టుకుని  ఎర్ర గీతాలు పాడి ఇపుడు  బీజేపీతో అంటకాగుతున్న పవన్ కి ఒక సిద్ధాంతం అంటూ ఉందా అని కూడా ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇక పదే పదే పవన్ పొత్తుల గురించి మాట్లాడం మీద కూడా ఆయన మండిపడుతున్నారు.

అసలు  ఈ సమయంలో పొత్తులు గురించి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల గురించి పవన్ పోరాటాలు చేస్తే బాగుంటుంది తప్ప పొత్తుల గురించి మాట్లాడడం సరి కాదని జనసేనాని వైఖరిని మధు నిరసించారు.

బీజేపీతో పొత్తు అని ఆరాటపడుతున్న పవన్ ఏపీకి వారు చేసిన అన్యాయం మీద పెదవి విప్పరేమి అని కూడా మధు గుచ్చి పారేశారు. మొత్తానికి పవన్ పొత్తులాట మీద మాజీ మిత్రుడు కస్సుబుస్సులాడుతున్నారు.

పవన్ రాజకీయల మీద ఆయన పార్టీ సిద్ధాంతాల మీద కూడా కన్నెర్ర చేశారు ఎర్రన్న.  తమతో పొత్తు తెంపుకుని పవన్ ముందుకు సాగుతున్నారన్న బాధ ఉండవచ్చు కానీ మరీ ఇంత కోపమైతే ఎలా కామ్రేడ్ అని అంతా అంటున్నారు.   ఆయన మాటలకు జనసేన నుంచి రిప్లై ఉంటుందా.
Tags:    

Similar News