బీజేపీకి అల్టీమేటం.. ఆ రెండిస్తేనే.?

Update: 2019-09-10 10:06 GMT
డీఎస్.. ధర్మపురి శ్రీనివాస్. వైఎస్ హయాంలో ఉమ్మడి ఏపీ పీసీసీ చీఫ్ గా రెండు సార్లు కాంగ్రెస్ ను   దివంగత వైఎస్ తో కలిసి అధికారంలోకి తీసుకొచ్చిన నేత. నేరుగా సోనియాగాంధీ వద్దకు వెళ్లగల సీనియర్. అలాంటి డీఎస్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ట్రెయిన్ రివర్స్ అయిపోయింది.

2000-10 వరకు దశాబ్ధం తెలుగు రాజకీయాలను ఏలిన ఆయన ఈ దశాబ్ధం (2010-20) మాత్రం రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ లో చేరడం.. కొడుకు బీజేపీలో చేరి సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించడం.. టీఆర్ ఎస్ కు డీఎస్ దూరంగా జరగడం జరిగిపోయింది. ఇప్పుడు టీఆర్ ఎస్ ను వీడలేక.. బీజేపీలో చేరలేక డీఎస్ సతమతమవుతున్నారు. బీజేపీలో చేరితే టీఆర్ ఎస్ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం రద్దవుతుందని భయం.. మరీ బీజేపీలోకి రావాలంటే పదవులు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ వినిపిస్తున్నారట..

ఇటీవల కొడుకు - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. డీఎస్ ను బీజేపీలో చేర్పించడానికి ప్రయత్నించగా.. తనకు బీజేపీ అధిష్టానం గవర్నర్ - లేదా కేంద్రంలోని నామినేటెడ్ పోస్టు ఇస్తే బీజేపీలో చేరుతానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఢిల్లీలో అమిత్ షాను కలిసి కూడా ఈ రెండింటిలో ఏదో ఒక పదవి ఇస్తే బీజేపీలో చేరుతానని చర్చలు జరిపినట్టు సమాచారం.

కాంగ్రెస్ రాజకీయాలను ఆవపోసన పట్టిన సీనియర్ డీఎస్ కు ఎంతో రాజకీయ చతురత.. తెలంగాణ లో మంచి గుర్తింపు ఉంది. కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోగల నైపుణ్యం ఉంది. తెలంగాణ బీజేపీ బలోపేతానికి అడుగులు వేస్తున్న కమలదళం తమకు డీఎస్ ఉపయోగపడుతాడని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈయనకు ఏదో పదవితో సంతృప్తి పరిచి బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందని సమాచారం. త్వరలోనే డీఎస్ కు పెద్ద పదవి లభిస్తుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News