ఆక్సిజన్ కొరత .. కేంద్రంపై మళ్ళీ నిప్పులు చెరిగిన హైకోర్టు !

Update: 2021-05-05 13:30 GMT
ఆక్సిజన్ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.  ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరలేదని, ఈ ప్రాణవాయువు పంపిణీలో మీకన్నా ఐఐటీలు, ఐఐఎంఎస్ సంస్థలు బాగా పని చేస్తాయని  చెప్తూ కేంద్రం తీరుని ఎండగట్టింది. ఢిల్లీకి 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం లేదన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కరోనా మహమ్మారి సోకిన రోగులకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ లభించడం లేదు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. మేం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడాన్ని ఎందుకు కోర్టు ధిక్కరణగా భావించకూడదో వివరణ ఇవ్వాలి’అని పేర్కొంది. ఢిల్లీకి ప్రతీరోజు 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. మేం కూడా ఆదేశించాం. మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు. పరిస్థితిని చూస్తున్నారు. అయినా స్పందన లేదు అని జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ రేఖల ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తాము ఈ నగరానికి 433 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని సోమవారం రాత్రే ఇచ్చామని కేంద్రం చెప్పగా, ఇది ఏమూలకూ చాలదని ప్రభుత్వ తరఫు లాయర్ అన్నారు. 420 మెట్రిక్ టన్నులు ఇచ్చినా రోగులు మరణిస్తున్నారనిఆయన చెప్పారు. కానీ ఇది మరీ విడ్డూరంగా ఉందని, వ్యవస్థను ప్రభావితం చేయడమేనని కేంద్రం వ్యాఖ్యానించగా.. కోర్టు మండిపడింది. మీ వ్యాఖ్య చాలా దురదృష్టకరమని, అసలు ఇలా ఎలా అంటారని ఫైర్ అయ్యింది. సైన్యం సహాయాన్నిమీరు తీసుకోవలసిందే..తీసుకోకపోతే కారణాలు చెప్పండి.. మీ నిస్సహాయత ఏమిటి అని వారు ప్రశ్నించారు. దానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు. అయితే దీనిపై ఉన్నత స్థాయి పరిశీలన జరుగుతోందని కేంద్రం చెప్పగా , ఆర్మీ సాయం తీసుకోవాలని తాము సూచించి 48 గంటలు గడిచిపోయాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  మా నోటీసులకు జవాబును బుధవారం స్వయంగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి సుమిత దావ్రా ఇవ్వాలని స్పష్టం చేసింది. గతంలో కూడా హైకోర్టు ఇలా కేంద్రంపై నిప్పులు చెరిగింది. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై కేంద్రం ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News