ఢిల్లీ సీఎం ఇంట్లోకి పోలీసులు వెళ్లారా?

Update: 2018-02-23 08:46 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇంట్లో ఆ మ‌ధ్య‌న రాష్ట్ర సీఎస్ పై ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్నారంటూ ఆరోప‌ణ‌లు రావ‌టం.. ఇదో సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే. అయితే.. కుట్ర‌పూర్వ‌కంగానే త‌మ‌పై ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్లుగా సీఎస్ తీరును త‌ప్ప ప‌ట్టారు ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు.

ఒక రాష్ట్ర సీఎస్ ను సీఎం నివాసానికి పిలిపించుకొని మ‌రీ దాడి చేశార‌న్న ఆరోప‌ణ‌లపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి వేళ‌.. ఈ రోజు అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎస్ అన్షు ప్ర‌కాష్ పై దాడి జ‌రిగిన ఉదంతానికి సంబంధించి ఆధారాల కోసం ఢిల్లీ పోలీసులు ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇంటికి వ‌చ్చారు. దాడికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ను ప‌రిశీలించ‌టం కోసం వ‌చ్చిన‌ట్లుగా పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంటిని 60 నుంచి 70 మంది పోలీసులు చుట్టుముట్టార‌ని.. ప్ర‌జాస్వామ్యంలో ఉండాల్సిన క‌నీస మ‌ర్యాద‌ను కూడా కేంద్రం పాటించ‌టం లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్ర‌తినిధి తీవ్రంగా మండిప‌డుతున్నారు.

త‌మ సీఎం ఇంట్లో సోదాలు నిర్వ‌హించ‌టం కాద‌ని.. ఢిల్లీ పోలీసుల‌కు ద‌మ్ము ఉంటే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఇంట్లో సోదాలు నిర్వ‌హించాల‌ని స‌వాలు విసిరారు. అమిత్ షాను లోయా కేసులో ప్ర‌శ్నించాల‌ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. త‌మ పార్టీని.. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకే బీజేపీ చేస్తున్న కుట్ర‌గా ఆమ్ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స‌ల‌హాదారుపై ఢిల్లీ పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి వారికి అనుకూలంగా మార్చి ప్ర‌క‌ట‌న చేయించుకున్నార‌ని ఢిల్లీ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి అరుణోద‌య్ ప్ర‌కాశ్ ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేశారు. ఆయ‌న వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం ఢిల్లీ సీఎం ఇంటికి 60 నుంచి 70 మంది పోలీసులు చేరుకున్నార‌ని.. వారు ఎలాంటి అనుమ‌తి లేకుండా సీఎం ఇంట్లోకి ప్ర‌వేశించార‌న్నారు.

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశార‌న్నారు. ప్ర‌తి పౌరుడికి రాజ్యాంగం కొన్ని హ‌క్కులు ఇచ్చాయ‌ని.. పేద‌ల కోసం అనుక్ష‌ణం శ్ర‌మిస్తున్న ఒక ముఖ్య‌మంత్రిని ఇంత దారుణంగా అవ‌మానిస్తారా? అంటూ ట్వీట్ ద్వారా ప్ర‌శ్నాస్త్రాన్ని సంధించారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ముఖ్య‌మంత్రి ఇంటిని పోలీసులు ఒక కేసు విష‌యంలో చుట్టుముట్ట‌టం.. సోదాలు నిర్వ‌హించ‌టం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News