మోదీకి నితీశ్ కుమార్ షాక్‌!

Update: 2017-07-31 09:30 GMT
బిహార్ లో మ‌హా సంఘ‌ట‌న్ కు సీఎం నితీశ్ కుమార్ టాటా చెప్పి బీజేపీతో చేతులు క‌ల‌ప‌డంతో బిహార్ రాజ‌కీయాలు ఆసక్తిక‌రంగా మారాయి. అక్క‌డ రాజ‌కీయ చ‌ద‌రంగం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. నితీశ్ దెబ్బ‌కు లాలూ అండ్ కో కుదేల‌యిన సంగ‌తి తెలిసిందే. జేడీయూలో నితీశ్ పై  కొద్దిగా అస‌మ్మ‌తి రాగం వినిపించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతానికి ఆ ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి. అయితే, జేడీయూ-బీజేపీ కూట‌మితో ఎక్కువ‌గా లాభ‌ప‌డేది బీజేపీ అనేది సుస్ప‌ష్టం.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప రాష్ట్రప‌తి ఎన్నికల నేప‌థ్యంలో మోదీ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి బిహా్ర్ లో పాగా వేశారు. రాజ్య‌స‌భ‌లో ఎన్డీఏకు బ‌లం లేని సంగ‌తి తెలిసిందే. నితీశ్ మ‌ద్ద‌తుతో రాజ్యసభలో మోడీకి అద‌న‌పు బ‌లం చేకూరింద‌ని ఎన్డీఏ వ‌ర్గాలు భావించాయి. అయితే, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మోదీకి నితీశ్ కుమార్ షాక్ ఇచ్చారు. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థి వెంక‌య్య‌నాయుడుకు తాము మ‌ద్ద‌తివ్వ‌బోమ‌ని  జేడీయూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. దీంతో, అనుకున్నదొక‌టి...అయిన‌ది ఒక్క‌టి అన్న చందంగా త‌యారైంది బీజేపీ ప‌రిస్థితి.

మిత్ర‌ప‌క్షం బీజేపీకి జేడీయూ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్య‌ర్థి  వెంకయ్యనాయుడికి తమ పార్టీ మద్దతివ్వబోదని తేల్చి చెప్పేసింది. యూపీఏ అభ్య‌ర్థి గోపాలకృష్ణ గాంధీకే తమ పార్టీ సభ్యులు ఓట్లు వేస్తారని జేడీయూ స్ప‌ష్టం చేసింది. మ‌హా సంఘ‌ట‌న్ నుంచి విడిపోవడానికి ముందే తాము గాంధీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి నేడు మీడియాకు వెల్లడించారు. ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ నిర్ణ‌యంలో ఎటువంటి మార్పు చేయ‌కూడ‌ద‌ని నితీశ్ కుమార్ నిర్ణయించారని ఆయ‌న తెలిపారు. పార్టీ త‌ర‌ఫున ఇదే విషయాన్ని బీజేపీకి కూడా స్పష్టం చేయనున్నామని వెల్లడించారు.

జేడీయూ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో బీజేపీ ఇర‌కాటంలో ప‌డింది. త‌మ‌కు త‌ప్ప‌క మ‌ద్ద‌తిస్తార‌ని భావించిన జేడీయూ హ్యండ్ ఇవ్వ‌డంతో బీజేపీ నేత‌లు ఖంగుతిన్నారు. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌లో ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ కు నితీశ్ మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. విప‌క్షాల‌న్నీ యూపీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి మీరా కుమార్ ను బ‌ల‌ప‌రిచిన సంద‌ర్భంలో నితీశ్ అందుకు భిన్నంగా రామ్ నాథ్ కు మ‌ద్ద‌తు తెలిపి విప‌క్షాల‌కు షాక్ ఇచ్చారు. ఇపుడు అదే త‌ర‌హాలో ఉప రాష్ట్రప‌తి ఎన్నిక విష‌యంలో కూడా అనూహ్య నిర్ణ‌యం తీసుకోవ‌డంతో బీజేపీ నేత‌లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో నితీశ్ నిర్ణ‌యంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News