ఛీ కొట్టించుకున్నాక‌.. దిన‌క‌ర‌న్ మాట ఇది..!

Update: 2017-04-19 09:14 GMT
న‌యానా.. భ‌యానా కొన్నిసార్లు అనుకోని అవ‌కాశాలు ల‌భిస్తాయి. అలాంటి స‌మ‌యాల్లో ఓర్పుతో.. నేర్పుతో అంద‌రి అభిమానాన్ని సొంతం చేసుకోవ‌టం ఒక అర్ట్‌. క‌లిసి వ‌చ్చిన కాలానికి మిడిసిప‌డుతూ.. చుట్టూ ఉన్న వారిని దూరం చేసుకోవటం దిన‌క‌ర‌న్ లాంటి వాళ్లు చేస్తుంటారు. ఎలాంటి త‌ప్పులైతే చేయ‌కూడ‌దో.. అలాంటి అన్నీ త‌ప్పులు చేసి..త‌న‌కు జై కొట్టినోళ్లంద‌రిని దూరం చేసుకున్న దిన‌క‌ర‌న్‌కు ఇప్పుడు వాస్త‌వాలు బోధ ప‌డుతున్నాయ‌ట‌.

చిన్న‌మ్మ‌ను ప‌న్నీరు సెల్వం ఎదిరించిన త‌ర్వాత‌.. తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా.. త‌న చాణక్యంతో శ‌శిక‌ళ‌.. ప‌రిస్థితుల్ని కంట్రోల్ చేయ‌టంతో పాటు.. త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఆ స‌మ‌యంలో ప‌న్నీరుతో పాటు త‌మిళ ప్ర‌జ‌లు.. సోష‌ల్ మీడియా అంతా చిన్న‌మ్మ‌కు వ్య‌తిరేకంగానే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. అమ్మ‌తో సుదీర్ఘ‌కాలం ఉన్న స‌హ‌వాసం తీసుకొచ్చిన నేర్పుతో ప‌రిస్థితుల్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోగ‌లిగారు.

అనుకోని విధంగా కోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సి రావటంతో.. మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్‌ ను తీసుకొచ్చి. పార్టీ ప‌ద‌విని ఇవ్వ‌టం తర్వాత త‌న ప్ర‌తినిధిగా ఆయ‌న్ను ఏర్పాటు చేసి ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలుకు వెళ్లిపోయారు తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో త‌న చేతికి వ‌చ్చిన ప‌గ్గాల్ని స‌మ‌ర్థ‌త‌తో మ‌రింత బ‌లం పెరిగేలా చూసుకోవాల్సిన దిన‌క‌ర‌న్ త‌న తీరుతో పార్టీ నేత‌ల మ‌నసుల్ని దోచుకోలేక‌పోయారు.

అదే స‌మ‌యంలో.. పార్టీ గుర్తును ద‌క్కించుకోవ‌టం కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌భ్యుడు ఒక‌రికి రూ.60 కోట్ల మేర లంచం ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌టం.. అది కాస్తా బ‌య‌ట‌కు వ‌చ్చి కేసుగా మార‌టంతో మొత్తం సీన్ మారిపోయింది. ఇలాంటి వేళ‌లోనే.. ఊహించ‌ని విధంగా ప‌న్నీరు సెల్వం సీన్లోకి ఎంట‌రై.. చీలిక‌వ‌ర్గాల్ని ఏకం చేసే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఇందులో భాగంగా చిన్న‌మ్మ‌.. అండ్ కోను పార్టీ నుంచి గెంటివేత అంశాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చిన్న‌మ్మ చెంత‌న ఉంటే.. మొత్తంగా మునిగిపోవ‌టం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించిన పళ‌నిస్వామి అండ్ కో.. కేంద్రం ఆశీస్సులు ఉన్న ప‌న్నీర్‌ తో ప్ర‌యాణించ‌టం మంచిద‌న్న కాన్సెప్ట్‌ లోకి వెళ్లిపోయారు.

దీంతో.. నిన్న మొన్న‌టివ‌ర‌కూ తిరుగులేని రీతిలో సాగుతున్న దిన‌క‌ర‌న్ కు మారిన ప‌రిస్థితులు ఒక్క‌సారిగా అర్థం కాలేదు. త‌న‌కు మ‌ద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల‌తో ఏదో చేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా.. ప‌రిస్థితి త‌న కంట్రోల్‌ లో లేద‌న్న విష‌యం అర్థ‌మైంది. ఓప‌క్క అరెస్ట్ ముప్పు వెంటాడుతున్న వేళ‌.. పార్టీతో పేచీలు పెట్టుకోలేక‌.. ఇప్పుడు టోన్ మార్చేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీ అండ ఏ మాత్రం లేకున్నా తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న విష‌యాన్ని అర్థం చేసుకున్న ఆయ‌న‌.. ఛీ కొట్టిన‌ప్ప‌టికీ అంతా త‌న వారేన‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.

నిన్న‌టి వ‌ర‌కూ ప‌ట్టుకోసం పాకులాడిన ఆయ‌న ఇప్పుడు మొత్తంగా మాట మార్చేశారు. త‌న‌ను ప‌క్క‌న పెట్టినా బాధ‌ప‌డ‌టం లేద‌న్న ఆయ‌న‌.. పార్టీని ఒక్క‌టిగా ఉంచాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని చెప్పారు.

పార్టీనే త‌న‌ను ప‌క్క‌న పెట్టింద‌ని.. త‌న ప‌ద‌వికి తాను రాజీనామా చేసే ప్ర‌సక్తే లేద‌న్న ఆయ‌న‌.. రాజీనామా చేయాల్సి వ‌స్తే చిన్న‌మ్మ‌తో చ‌ర్చించాకే నిర్ణ‌య‌మ‌ని వెల్ల‌డించారు. త‌న‌ను ఆమె ఉప ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా నియ‌మించింద‌ని.. అందుకే ఆమె నిర్ణ‌యానికి త‌గిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌న‌న్నారు. ప‌న్నీర్ వ‌ర్గంతో విలీనం కార‌ణంగా పార్టీకి మేలు జ‌రుగుతుందంటే.. అందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.  పార్టీకి.. ప్ర‌భుత్వానికి దూరంగా ఉంటాన‌ని.. తాను ఎలాంటి పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు. ఈ బుద్ధి ఏదో మొద‌టి నుంచే ఉంటే.. ఇప్పుడీ ప‌రిస్థితే ఉండేది కాదు క‌దా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News