ఆ రాష్ట్రంలో మూడో వేవ్ మొదలైందా?

Update: 2021-05-21 13:30 GMT
సెకండ్ వేవ్ ఇస్తున్న షాకులతోనే దేశం కోలుకోలేని పరిస్థితి నెలకొంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ భారత్ కు పీడకలగా మారింది. దీని నుంచి ఎంత త్వరగా బయటపడతామా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం జులై రెండో వారానికి కేసుల తీవ్రత భారీగా తగ్గుతుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ప్రకటనలు కొంత ఊరట కలిగిస్తున్నా.. కొన్ని రాష్ట్రాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసులు కొత్త ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తాజాగా కర్ణాటకలో నమోదవుతున్న కేసుల తీరుపై కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే.. ఈ రాష్ట్రంలో పదేళ్ల లోపు పిల్లల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తిస్తున్నారు. దీంతో.. కరోనా కొత్త మ్యూటెంట్లు ఏమైనా వచ్చాయా? థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించి రెండు వారాలు కావొస్తోంది.

లాక్ డౌన్ తర్వాత కూడా కేసుల నమోదులో మార్పు రాకపోవం.. చిన్నారుల్లో కేసుల సంఖ్య పెరగటం ఆందోళనకు గురి చేస్తోంది. మార్చి నుంచి మే 9 మధ్యకాలంలో తొమ్మిదేళ్ల లోపు పిల్లల్లో 39వేల కేసులు నమోదు కాగా.. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు ఏకంగా 1.05లక్షల మందికి కరోనా సోకటం ప్రశ్నగా మారింది. ఒక అంచనా ప్రకారం స్వల్ప వ్యవధిలో చిన్నారుల్లో 145 శాతం ఎక్కువగా.. టీనేజ్ వారిలో 160 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి.

కరోనా సోకిన పెద్దల కారణంగా పిల్లలు ప్రైమరీ కాంటాక్టుగా మారి వారు కూడా పాజిటివ్ అవుతున్నారు. థర్డ్ వేవ్ అన్నది శాస్త్రీయంగా తేలలేదని.. అలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ.. అనుమానాలు నిజమై.. థర్డ్ వేవ్ అయితే..కర్ణాటకకు పెద్ద అగ్నిపరీక్షే ఎదురైనట్లు చెప్పాలి. ఇలాంటి సమయంలో కేరళలో అమలు చేస్తున్న ట్రిపుల్ లాక్ డౌన్ ను అమలు చేస్తే.. కేసుల నమోదులో మార్పు వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News