త‌న శ‌వం మీద కాంగ్రెస్ జెండా అన్నోడు బాబుతో భేటీనా?

Update: 2019-02-20 09:00 GMT
రాజ‌కీయ నేత‌లు చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు అస్స‌లు సంబంధం ఉండ‌ద‌ని ప‌లువురు చెబుతుంటారు. అయితే.. తాము అలాంటి ఇలాంటి నేత‌లం కాద‌ని.. మాట మీద మాత్ర‌మే నిల‌బ‌డే వాళ్ల‌మ‌ని చెప్పే నేత‌ల‌కు కొద‌వ ఉండ‌దు. తాము ఈ త‌రానికి చెందిన వాళ్లం కాదంటూ చ‌రిత్ర‌ను చెబుతూ ఉంటారు.

అలాంటి నేత‌ల్లో ఒక సీనియ‌ర్ నేత తాజాగా చేస్తున్న ప‌ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఇంత‌కీ ఎవ‌రా నేత అంటే.. క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి. త‌న‌కు.. కాంగ్రెస్‌ పార్టీకి మ‌ధ్య‌నున్న అనుబంధం అలాంటి ఇలాంటిది కాద‌ని.. తాను చ‌నిపోతే త‌న భౌతికాయం మీద‌న కాంగ్రెస్ జెండానే త‌ప్పించి మ‌రొక‌టి ఉండ‌ద‌న్న బ‌డాయి మాట‌లు డీఎల్ సొంతం.

అలాంటి డీఎల్ ఈ రోజు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో భేటీ కానున్నారు. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే ఆయ‌న ప‌సుపు కండువా మెడ‌లో ప‌డ‌నుంది. ఎన్నిక‌ల సంద‌డి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న వేళ‌.. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార పక్షం నుంచి విప‌క్షంలోకి.. విప‌క్ష నేత‌లు కొంద‌రు అధికార‌ప‌క్షంలోకి జంప్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌డిచిన కొంత‌కాలంగా క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న డీఎల్.. తాజాగా టీడీపీలోకి చేరాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు మైద‌కూరు టీడీపీ టికెట్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఓకే చెబితే ఆయ‌న పార్టీలోకి చేర‌టం ఖాయ‌మంటున్నారు. ఇప్ప‌టికే డీఎల్ కు టికెట్ ఇచ్చేందుకు బాబు త‌న స‌మ్మ‌తిని తెలియ‌జేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. వీర కాంగ్రెస్ వాదిగా త‌న‌ను తాను చెప్పుకున్న డీఎల్.. తాజాగా త‌న మెడ‌లో ప‌చ్చ కండువాను వేసుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతున్న తీరు చూస్తే.. కాలం ఎవ‌రిని.. ఎలా అయినా మారుస్తుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.



Tags:    

Similar News