ఈ వృద్ధ కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు అంత సీన్ ఉందా?

Update: 2022-12-23 05:30 GMT
దేశం మొత్తం యువ‌త వైపు చూస్తోంది. రాజ‌కీయాలైనా..పారిశ్రామిక రంగ‌మైనా.. ఆర్థిక రంగ‌మైనా.. ఇప్పుడు జ‌పం అంతా యువ‌త చుట్టూనే తిరుగుతోంది. ఇత‌ర రంగాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్ర‌, దేశ రాజ‌కీయాల్లో యువ‌త భాగ‌స్వామ్యం గ‌త ప‌దేళ్ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు భారీగా క‌నిపిస్తోంది. దేశంలోని 30 రాష్ట్రాల్లో 18 చోట్ల యువ ముఖ్య‌మంత్రులే సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఇక‌, ప్ర‌ధాన జాతీయ పార్టీ బీజేపీ కూడా యువ‌త‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తోంది.

కీల‌క స్థానాల్లో ఎవ‌రు ఉన్నా.. రాష్ట్రాల స్థాయిలో పార్టీని న‌డిపించే బాధ్య‌త‌ల‌ను వారికే అప్ప‌గిస్తున్నారు. ఇది ఇప్పుడు రాజ‌కీయాల్లో సాగుతున్న ట్రెండ్‌. రాష్ట్రాల అసెంబ్లీలు కూడా యువ‌త‌తో నిండిపోతున్నాయి. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో దేశవ్యాప్తంగా సుప్త‌చేత‌నావ‌స్థ‌లో బ‌తుకు జీవుడా అంటూ.. ప‌డిలేస్తున్న కాంగ్రెస్‌కు యువ‌త‌రం అక్క‌ర్లేదా?  యువ నాయ‌క‌త్వం అస‌వ‌రం క‌నిపించ‌డం లేదా? అనేది ప్ర‌శ్న‌.

మ‌రీ ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రం తామే ఇచ్చామ‌ని చెప్పుకొన్న చోట‌.. ఇప్పుడున్న ప‌రిస్థితి ఎలా ఉంది?  అధికార పార్టీ టీఆర్ ఎస్‌, బీజేపీల దెబ్బ‌కు కాంగ్రెస్ చావుత‌ప్పి నంత ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో యువ నాయ‌క‌త్వాన్ని మ‌రింత పెంచి పార్టీని ప‌రుగులు పెట్టాల్సిన వృద్ధ నాయ‌కత్వం ఏం చేస్తోంది?  అంటే.. తీరిగ్గా కూర్చుని కీచులాడుకుంటుంది. పార్టీని కూక‌టివేళ్ల‌తో పెక‌లించి వేయాల‌న్న కంక‌ణం క‌ట్టుకున్నట్టుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొన్ని రోజుల కింద‌ట పార్టీ అధిష్టానం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. మండ‌ల‌, జిల్లా స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు భారీ ఎత్తున క‌మిటీలు నియ‌మించింది. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తు వృద్ధ నేత‌లు తెర‌మీదికి వ‌చ్చారు. అస‌లు ఇప్పుడు పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డినే వ‌ద్దు.. అనేలా..ఆయ‌న ను టార్గెట్ చేస్తూ.. రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. రేవంత్ బ‌య‌ట నుంచి వ‌చ్చాడ‌ని, టీడీపీ మ‌ద్ద‌తు దార‌ని.. ఆయ‌న త‌మ‌ను డిక్టేట్ చేయ‌డం ఏంట‌ని .. వృద్ధ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

పోనీ..ఈ వృద్ధ నేత‌ల‌కు సారథ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. పార్టీని పుంజుకునేలా చేయ‌గ‌ల‌రా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. గ‌తంలో జాతీయ అధ్య‌క్షుడుగా ఉన్న సీతారా కేస‌రి కూడా.. పాడెక్కే వ‌ర‌కు కాడి వ‌దిలేది లేద‌ని..పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసి పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈతెలంగాణ‌ నాయ‌కులు అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది పార్టీ విశ్లేష‌కుల అంచ‌నా గా ఉంది. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పార్టీ చ‌తికిల ప‌డ‌డానికి ఎక్క‌డిక‌క్క‌డ త‌మ‌దే ఆధిప‌త్యం అంటూ.. తెర‌మీదికి వ‌చ్చిన వృద్ధ‌నాయ‌కులు కార‌ణం కాదా? కానీ, ఈ విష‌యాన్ని మాత్రం  మ‌రిచిపోతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరేం చేయ‌గ‌ల‌రు?

తెలంగాణలో త్వ‌ర‌లోనేఎన్నిక‌లు వున్నాయి. ఇక‌, సార్వ‌త్రిక పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు కూడా ముహూర్తం చేరువ అవుతోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పుంజుకునేలా చేసి.. పార్టీని గాడిలో పెట్టి అధికారం దిశ‌గా న‌డిపించాల్సిన బాధ్య‌త రాష్ట్ర నాయ‌కత్వంపై ఉంది. ఇలాంటి స‌మ‌యంలో వృద్ధ నేత‌ల‌కు కాడి అప్ప‌గిస్తే.. ఎంత వ‌ర‌కు మోయ‌గ‌ల‌రు? అంటే.. గుమ్మం కూడా దాటించ‌లేని విష‌యం అంద‌రికీ తెలిసిందే. పైగా తెలంగాణ ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మారాయి.

ఇటు..కేటీఆర్ వంటి యువ నేత‌ల సార‌థ్యం.. అటు బండి సంజ‌య్ దూకుడు.. వెరసి తెలంగాణ రాజ‌కీయాల‌ను అట్టుడికిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఫైర్ బ్రాండ్ వంటి రేవంత్ సార‌థ్యాన్ని వ‌దులుకుంటే.. పార్టీ అస‌లు మ‌న‌గ‌లుగుతుందా? అనేది ప్ర‌శ్న‌. ముందు పార్టీ అంటూ.. అధికారంలోకి వ‌స్తే.. త‌ర్వాత‌.. ఈ వృద్ధ నేత‌లు.. ఏదో ఒక ప‌దవికోసం.. ప్ర‌య‌త్నాలు చేయొచ్చు. కానీ, ఇప్పుడు అస‌లు పార్టీనే అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా ర‌గ‌డ‌తో ఎవ‌రికి  లాభం?

రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను స‌రిదిద్దేందుకు.. అధిష్టానం దూత‌గా.. దిగ్విజ‌య్ సింగ్ వ‌చ్చారు. కానీ, ఆయ‌న ముందు కూడా ఇదే ర‌గ‌డ‌. కాల‌ర్‌లు ప‌ట్టుకుని త‌న్నుకునే ప‌రిస్థితికి దిగ‌జారారు. సేవ్ కాంగ్రెస్ అనే మాట ప్ర‌తిధ్వ‌నించిందంటే.. పార్టీ ప‌రిస్థితి ఎంత న‌గుబాటుగా త‌యారైంది. ఇప్పుడు జ‌నంలోకి వెళ్లి ఏం చెబుతారు?  రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై ఎలా పోరాడ‌తారు? ఈ కీల‌క విష‌యాల‌ను వ‌దిలేసి.. ఇప్పుడు రోడ్డున ప‌డితే.. పూర్తిగా న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ పార్టీనే అని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News