మత్తు ఇవ్వకుండానే స్మార్ట్‌ఫోన్‌లో 'అడవి దొంగ' సినిమా చూపించి ఆపరేషన్

Update: 2022-08-26 06:30 GMT
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతమే చేశారు. ఓ అరుదైన శస్త్రచికిత్సను చేసి చూపించారు. ఓ 50 ఏళ్ల మహిళకు ట్యాబ్ లో చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ ఆమెతో మాట్లాడుతూ రెండుగంటల పాటు సర్జరీ చేసి అరుదైన రికార్డును సృష్టించారు.

రోగి సృహలో ఉండగానే మెదడులోని కణితిని న్యూరో సర్జరీ విభాగం, అనస్తీషియా విభాగం వైద్యులు కలిసి విజయవంతంగా తొలగించారు. రోగికి సృహలో ఉండేందుకుగాను చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ ఆ సినిమా గురించి ఆమెతో మాట్లాడుతూ రెండుగంటల పాటు చేసిన ఈ సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ శస్త్రచికిత్సను న్యూరో సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ నాగరాజు, అనస్థీషియా విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సారయ్య, అబ్బయ్య, ప్రతీక్ష  పీజీ వైద్యులు కలిసి నిర్వహించారు. వీరంతా రెండు గంటల పాటు ఈ ఆపరేషన్ కోసం కష్టపడ్డారు.

ఆపరేషన్ సక్సెస్ కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ శస్త్రచికిత్సను వైద్యపరిభాషలో అవేక్ క్రానియోటమీ అంటారని వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో సినిమా చూస్తూ వైద్యులకు మహిళ బాగా సహకరించారని గాంధీ వైద్యులు చెప్పారు.

మనిషి చేతనంగా ఉన్న సమయంలో నిర్వహించే అరుదైన మెదడు శస్త్రచికిత్స ఇది అని వైద్యులు చెబుతున్నారు. ఇది మెలకువగా.. అప్రమత్తంగా ఉన్నప్పుడు మెదడుపై చేసే ఒక రకమైన ప్రక్రియ అని చెబుతున్నారు.

గాంధీలో ఇదే కాదు.. ఇటీవల 15 లక్షలు వ్యయం అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఓ చిన్నారికి ఉచితంగా చేసి గాంధీ వైద్యులు అబ్బురపరిచారు. గాంధీ వైద్యులను వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కూడా ఓ ట్వీట్ లో అభినందించారు.
Tags:    

Similar News