మ‌న పంచాయ‌తీతో ట్రంప్‌ కు బీపీ

Update: 2017-09-04 10:47 GMT
త‌న‌దైనశైలిలో వింత నిర్ణ‌యాల‌తో ఇత‌రుల‌ను దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డేసే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఇప్పుడు స‌రిగ్గా అలా ఇత‌రుల కార‌ణంగానే బిత్తిరిపోయే ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ట‌. త‌న దేశం విదేశాంగ విధానాల‌తో ఆయా దేశాల‌ను ఇర‌కాటంలో ప‌డేసే ట్రంప్ ఇప్పుడు అదే దౌత్య స‌మ‌స్య‌తో చిక్కుల్లో ప‌డ్డార‌ట‌. ఇది భార‌త్‌ తో కూడి ఉన్న అంశం కావ‌డం గ‌మ‌నార్హం.భారత్ - చైనాల మధ్య తలెత్తిన డోక్లామ్ వివాదం ట్రంప్ ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేసిందని  అమెరికా నిపుణుడొకరు విశ్లేషించారు. ఇప్పటికే ఉత్తర కొరియా వివాదంలో ప్రభుత్వం తలమునకలుగా ఉండడం, ఈ విషయంలో చైనా ప్రభుత్వం సాయాన్ని తీసుకోవాలని అది అనుకొంటూ ఉండడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకొందని అంటున్నారు.

‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొనడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందుగా గత సోమవారం భారత్ - చైనాలు తమ సైన్యాలను ఉపసంహరించుకోవడం ద్వారా 73 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించుకొన్న విషయం తెలిసిందే. అయితే, డోక్లాం సంక్షోభంతో ట్రంప్ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొందని హెరిటేజ్ ఫౌండేషన్‌ లో దక్షిణాసియా వ్యవహారాల రిసెర్చ్ ఫెలోగా పని చేస్తున్న జెఫ్ స్మిత్ అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా ఉత్తర కొరియా సమస్యతో అమెరికా తలమునకలై ఉండడం, ఈ విషయంలో చైనా సహాయాన్ని తీసుకోవాలని అనుకొంటున్న కారణంగా ఈ వివాదం తలెత్తడం వారికి ఏ విధంగాను ఇష్టం లేదని స్మిత్ అన్నారు. డోక్లాం వివాదంపై ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం చర్చలు జరిగాయో తనకు పూర్తిగా తెలియకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యాఖ్యలను గమనించినట్లయితే జపాన్ మాదిరిగా ట్రంప్ ప్రభుత్వం కూడా పరోక్షంగా భారత వైఖరినే సమర్థిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు.
Tags:    

Similar News