చమురు దాహాన్ని పబ్లిక్ గా చెప్పేశాడు

Update: 2016-01-05 04:52 GMT
ప్రపంచానికి పెద్దన్న అమెరికాను ప్రపంచంలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అమెరికా భావజాలాన్ని ఏ మాత్రం సమర్థించరు. తన ఎదుగుదల తప్పించి.. పక్కోళ్ల గురించి ఏ మాత్రం ఆలోచించని అగ్రరాజ్య తీరు మేధావులు సైతం తప్పు పడుతుంటారు. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ.. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలన్న భావన కన్నా.. తాను ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని.. అందుకు ఏం చేయటానికైనా సరే రెఢీ అన్నట్లుగా వ్యవహరించే అగ్రరాజ్య వైఖరి ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదంగా మారింది.

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ తీవ్రవాదుల పుట్టుకకు.. ఇరాక్ విషయంలో అమెరికా అనుసరించిన విధానమే. అంతదాకా ఎందుకు అల్ ఖైదాను పెంచి పోషించింది అగ్రరాజ్యమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన ఆయుధ వ్యాపారాన్ని మరింత పెంచుకోవటం.. తన అవసరాలకు.. అభివృద్ధికి కీలకమైన చమురు సొంతం చేసుకోవటానికి ఇప్పటికే ఎన్నో ఆరాచకాలకు పాల్పడింది.

అయితే.. ఇదంతా వ్యూహాత్మకంగా సాగే ప్రక్రియ. దాన్ని బద్ధలుకొడుతూ తాజాగా తమ చమురుదాహాన్ని ఓపెన్ గానే చెప్పాశాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ల అభ్యర్థి బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్. తన దూకుడు వ్యాఖ్యలతో పాటు.. ముస్లిం వ్యతిరేకతను ఓపెన్ గా చెప్పేసి కలకలం రేపుతున్న ట్రంప్.. తాజాగా తనకున్న చమురు దాహాన్ని బయటపెట్టేశాడు.

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా చేపట్టిన తన తొలి టీవీ ప్రకటనలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కానీ అధికారంలోకి వస్తే.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తల నరుకుతానని... వారి వద్దనున్న చమురు మొత్తాన్నీ తరలిస్తాని.. అమెరికాను అత్యున్నంగా తీర్చిదిద్దుతానని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన ఇస్లామిక్ స్టేట్ ను అంతమొందిస్తానని చెప్పటంలో అర్థం ఉంది. కానీ.. అదంతా వారి దగ్గరున్న చమురు కోసమేనన్నట్లుగా అన్నట్లు వినిపించే శ్లేషను చూస్తే మాత్రం.. అగ్రరాజ్య దురహంకారం డొనల్డ్ ట్రంప్ రూపంలో నిలువెత్తు రూపంగా కనిపించక మానదు.
Tags:    

Similar News