మా మీదే 100% ప‌న్నులా? భార‌త్‌పై ట్రంప్ ఫైర్‌!

Update: 2018-06-27 08:08 GMT
ట్రంప్‌కు కోపం వ‌చ్చింది. అగ్ర‌రాజ్య అధినేత‌గా తానేం అనుకుంటే అది సాగిపోయే రోజులు పోవ‌టం.. చిన్న దేశాలు మొద‌లు పెద్ద దేశాల వ‌ర‌కూ ఎవ‌రికి వారు.. త‌మ దేశ ప్ర‌యోజ‌నాల మీద‌నే దృష్టి పెట్ట‌టంతో ట్రంప్ కు ఇబ్బందిక‌రంగా మారింది. త‌న‌కు త‌న దేశం ఎంత ముఖ్య‌మో.. మిగిలిన పాల‌కుల‌కూ అంతేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయే అగ్ర‌రాజ్యాధినేత‌కు భార‌త్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం అస్సలు న‌చ్చ‌లేదు.
 
భార‌త్ నుంచి ఎగుమ‌తి అయ్యే ఉత్ప‌త్తుల‌పై భారీగా ప‌న్నులు వ‌డ్డించ‌టం.. దీనికి ప్ర‌తిగా అమెరికా నుంచి ఇండియాకు దిగుమ‌తి అయ్యే వ‌స్తుత్పుత్తుల‌పై 100 శాతం ప‌న్నులు విధించ‌టంపై ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వారం వ్య‌వ‌ధిలో భార‌త్‌.. అమెరికాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. వివిధ దేశాల మ‌ధ్య వాణిజ్య యుద్ధం జ‌రుగుతుంద‌న్న మాట‌ను చెప్పిన ట్రంప్‌.. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా భార‌త్ ను ప్ర‌స్తావించి త‌న అక్క‌సును ప్ర‌ద‌ర్శించారు.

భార‌త్ తాము దిగుమ‌తి చేసుకునే అమెరిక‌న్ ఉత్పత్తుల‌పై 100 శాతం ప‌న్ను వ‌సూలు చేస్తున్నార‌ని.. ఈ ప‌న్నుల్ని త‌గ్గించాల‌ని తాము కోరుతున్న‌ట్లు చెప్పారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల‌పై ట్రంప్ ప‌న్నుల భారాన్ని పెంచ‌టంతో ఆయ‌న బాట‌లోనే మిగిలిన దేశాలు న‌డ‌వ‌టంతో ఆయ‌న‌కు ఓ ప‌ట్టాన మింగుడుప‌డ‌టం లేదు.  అయితే.. తాము ప‌న్నులు పెంచ‌టాన్ని దేశ వాణిజ్య స‌మ‌తుల్య‌త‌ను కాపాడుకునేందుకంటూ క‌వ‌ర్ చేస్తున్న ట్రంప్‌.. అదే ప‌ని మిగిలిన దేశాల వారు చేస్తుంటే మాత్రం నో అనేస్తున్నారు.

యూర‌ప్ లోని ప‌లు దేశాల‌తో పాటు.. చైనా..ఇండియాలు అమెరిక‌న్ ఉత్ప‌త్తుల‌పై భారీగా పెంచిన ప‌న్నుల్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న కోరుతున్నారు. గ‌తంలో తాను జీ 7 దేశాల భేటీ సంద‌ర్భంగా తాను ప్ర‌స్తావించిన ప్ర‌తిపాద‌న‌ను గుర్తు చేశారు. అన్ని ర‌కాల సుంకాల్ని తొల‌గించి.. స‌రిహ‌ద్దులు చెరిపివేద్దామ‌ని తాను స‌ల‌హా ఇస్తే.. ఆ రోజున ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ని.. అందుకే తాను త‌న నిర్ణయాన్ని తీసుకున్నాన‌ని..కానీ.. ఇప్పుడేమో అంద‌రూ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

అమెరికా ఒక బ్యాంకు లాంటిద‌ని.. అంద‌రూ బ్యాంక్ ను లూటీ చేయాల‌నే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. గ‌త ఏడాది చైనాతో తాము జ‌రిపిన వాణిజ్యం కార‌ణంగా 500 బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయామ‌ని.. యూరోపియ‌న్ యూనియ‌న్ తో జ‌రిపిన వాణిజ్యం కార‌ణంగా 151 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టానికి గురైన‌ట్లుగా చెప్పారు. వారం వ్య‌వ‌ధిలో భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌.. ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ లు క‌లిసి అమెరికాలో ట్రంప్ ప్ర‌తినిధుల‌తో భేటీ జ‌రప‌నున్న వేళ‌.. ట్రంప్ భార‌త్ తీరును త‌ప్పు ప‌ట్ట‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
Tags:    

Similar News