పాకిస్తాన్‌ కు ట్రంప్ గ‌ట్టి వార్నింగే ఇచ్చాడుగా

Update: 2017-10-28 01:30 GMT
 ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌ కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఉగ్ర గ్రూపులపై పాక్ కఠినతరమైన చర్యలు తీసుకోకుంటే.. తామే స్వయంగా ఓ వ్యూహాన్ని అనుసరించనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. తమ లక్ష్యాలను అందుకునేందుకు చాలా విభిన్నమైన రీతిలో ప్రణాళికలు వేయనున్నట్లు అమెరికా పేర్కొన్నది. అమెరికా విదేశాంగ మంత్రి రిక్స్ టిల్లర్సన్ తన విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత ఈ ప్రకటన వెలుబడింది. ఆఫ్ఘనిస్తాన్ - భారత్ - పాకిస్థాన్‌ లో ఇటీవలే టిల్లర్సన్ పర్యటించారు. ఆ తర్వాతే అమెరికా స్టేట్ డిపార్ట్‌ మెంట్ ఇవాళ ఈ ప్రకటన రిలీజ్ చేసింది. ఉగ్రస్థావరాలను పాక్ నాశనం చేయాలని ఆ దేశానికి తీవ్రంగా హెచ్చరించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ పాక్‌ నేతలతో జరిపిన చర్చల గురించి టిల్ల‌ర్స‌న్ వివరించారు. ‘ఆ పని మీరు చేయాలనుకోకపోతే, చేయలేమని భావిస్తే.. మేం మా వ్యూహాలను ఎత్తుగడలను సవరించుకుని ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. ఒక సార్వభౌమ దేశంగా మిమ్మల్ని డిమాండ్‌ చేయలేం.. కానీ మేం ఆశిస్తున్నది ఇదీ అని  మాత్రం పాక్‌ నేతలకు నొక్కిచెప్పాం’ అని  టిల్లర్‌ సన్‌ వివరించారు. అలాగని తాను పాక్‌ నేతలకు ఉపన్యాసం ఇచ్చినట్టుగా భావించడానికి వీల్లేదని, ఉభయపక్షాలూ మనసు విప్పి అన్ని విషయాలను విడమర్చి చర్చించుకున్నాయని ఆయన అన్నారు. ‘నేను పాక్‌ నేతలను కలుసుకోవడం ఇదే మొదటిసారి కనుక చాలావరకు సమయం వినడానికే కేటాయించాను. 80 శాతం విన్నాను. 20 శాతం మాట్లాడాను’  అని ఆయన అన్నారు. ఉగ్రవాద సంస్థలు ఎక్కడున్నా మట్టుబెట్టాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు ఏమేం చేయగలమనేది ఆలోచిస్తున్నాం అని అమెరికా విదేశాంగమంత్రి నొక్కిచెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని ఆయన సూచించారు. ఆ మాటకు వస్తే తమ దక్షిణాసియా విధానమంతా క్షేత్రస్థాయి పరిస్థితుల మీదనే ఆధారపపడి ఉంటుందని ఆయన తెలిపారు. మొత్తం 75 మంది ఉగ్రవాదుల జాబితాను పాక్‌ కు అమెరికా సమర్పించినట్లు తెలుస్తున్నది. అయితే అమెరికా ఒత్తిళ్లకు లోనయ్యేది లేదని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.
Tags:    

Similar News