డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ను బ్రిటన్ మీడియా కవర్ చేసింది

Update: 2020-05-23 04:30 GMT
కొందరు చేసే తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయని చెప్పాలి. విశాఖలో కొందరు పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించిన తీరు ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వివాదం అంతకంతకూ పెరగటమే కాదు.. హైకోర్టు సైతం ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే అంశానికి సంబంధించి యూకే మీడియా సంస్థ ఒకటి కథనాన్ని ప్రచురించింది.

భారత్ లో మాస్కుల కొరతను ప్రశ్నించిన వైద్యుడ్ని మెంటల్ ఆసుపత్రికి పంపారంటూ యూకేకు చెందిన మెట్రో పత్రిక ఒక కథనాన్ని అచ్చేసింది. ‘‘డాక్టర్ ఇన్ ఇండియన్ పీపీఈ రో.. బండిల్డ్ ఆఫ్ టూ మెంటల్ యూనిట్’’ హెడ్డింగ్ తో కథనాన్ని ప్రచురించింది. డాక్టర్ సుధాకర్ తో పోలీసులు ప్రవర్తించిన తీరు.. అంతకు ముందు అసలేం జరిగిందన్న విషయాల్ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ కథనంలో డాక్టర్ సుధాకర్ చొక్కా లేకుండా ఉన్న ఫోటోను అచ్చేసింది. ఈ ఫోటోలో ఆయన చేతుల్ని పోలీసులు వెనక్కి పెట్టి తాడుతో కడుతున్న ఫోటోను వాడారు. డాక్టర్ సుధాకర్ ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగానూ మీడియా కథనంగా మారటం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
జోయల్ టేలర్ అనే పాత్రికేయుడు ఈ కథనాన్ని రాశారు. ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాల్ని మసకబరిచేలా డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ నిలిచిందన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది. ఈ విషయంలో అధికారుల కారణంగా ప్రభుత్వానికి చిక్కులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News