ఇద్ద‌రి మృతికి కార‌ణ‌మైన ఎమ్మెల్యే కారు..ఆగ‌కుండా వెళ్లిన వైనం

Update: 2018-08-30 05:08 GMT
టీడీపీలోకి జంపింగ్ చేసిన ప్ర‌కాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తీరుపై స‌ర్వత్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన హ‌రికృష్ణకు నివాళులు అర్పించేందుకు ఎయిర్ పోర్ట్ వెళుతున్న ఆయ‌న కారు ఇద్ద‌రు వృద్ధుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది.

స్కూటీ పై వెళుతున్న ఇద్ద‌రు వృద్ధ దంప‌తుల‌ను వేగంగా వెళుతున్న ఎమ్మెల్యే కారు ఢీ కొట్టింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే.. కారు దిగిన ఎమ్మెల్యే పోతుల గ‌న్ మెన్ల‌తో క‌లిసి ఆటోలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లిన వైనాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. టీడీపీ నేత పోతుల తీరు పై స్థానికంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌మాదంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారును ఎమ్మెల్యేనే న‌డుపుతున్నార‌ని.. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆయ‌న్ను డ్రైవ‌ర్ సీటు నుంచి గ‌న్ మెన్లు బ‌య‌ట‌కు తీసుకొచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. కారు డ్రైవ‌ర్ సైతం పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో కారును న‌డుపుతున్న‌ట్లుగా చెబుతున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించినా.. వారి గురించి అస్స‌లు ప‌ట్టించుకోకుండా ఆటోలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్ల‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఓవైపు ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మై.. ఇద్ద‌రు మృతికి బాధ్య‌త వ‌హించాల్సిన ఎమ్మెల్యే.. క‌నీసం ఆగ‌ని వైనాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌డు కారును న‌డిపింది ఎమ్మెల్యేన‌ని చెబుతున్నారు. అయితే.. స్థానికుల వాద‌న‌కు భిన్నంగా ప్ర‌మాదానికి కార‌ణం కారు డ్రైవ‌ర్ కొండ‌ల‌రావుపై పోలీసులు కేసును న‌మోదు చేయ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News