దొరికిన ఏపీ పోలీసులు.. ఈసీ నోటీసులు

Update: 2018-10-28 10:13 GMT
తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా సర్వేలు చేయడం.. వారిని టీఆర్ ఎస్ నేతలు పట్టుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆరుగురు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు పట్టుబడిన ఉందంతంపై మంత్రి కేటీఆర్ ఈసీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు  డబ్బులు పంచుతున్నాడంటూ ఆరోపించారు. ఇప్పుడీ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. ఏపీ, తెలంగాణ డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ డీజీపీ నుంచి సమాధానం వచ్చాక పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై  ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో గులాబీ రంగు పోలింగ్ బూతులు, బ్యాలెట్ పేపర్లపై వచ్చిన ఫిర్యాదులపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు.  గులాబీ రంగు మహిళా శక్తికి ప్రతీక అని.. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఈ రంగుకు , టీఆర్ఎస్ పార్టీ రంగు ఒకటే కావడం యాధృశ్చికం అని ఆయన అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే గుర్తింపు పొందిన 22 పార్టీలకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించిందని రజత్ కుమార్ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు నవంబర్ 9 వరకు గడువు ఇచ్చామని.. యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇక ప్రగతి భవన్, మినిస్టర్ల క్వార్టర్లలో టీఆర్ఎస్ కార్యకలాపాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరామని.. రాగానే నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా డీజీపీ వివరణ కోరామని తెలిపారు.
Tags:    

Similar News