ఆ గులాబీ నేతతో కలిసి ఢిల్లీకి ఈటల.. ఇవాళేం జరగనుంది?

Update: 2021-05-31 04:31 GMT
గడిచిన కొద్ది కాలంగా గులాబీ బాస్  కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి గురై.. తీవ్ర అవస్థలు పడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరేందుకు ఫైనల్ అయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ట్రిప్ మీద ఎలాంటి సమాచారాన్ని ఇవ్వని ఈటల.. హటాత్తుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమివ్వటం చర్చనీయాంశంగా మారింది. చూస్తుంటే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి కాస్త ముందే.. బీజేపీలో చేరనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు (సోమవారం) ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసే వీలుందని చెబుతున్నారు. అయితే ఈ రోజు లేదంటే మంగళవారం కలిసే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉండదని.. ముందుగా బీజేపీ అగ్రనేతల్ని కలిసి.. వారి నుంచి కొన్ని అంశాల్లో స్పష్టమైన హామీల్ని పొందుతారని.. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారని చెబుతున్నారు.

ఏదో చేరామంటే చేరామన్నట్లు  కాకుండా.. బీజేపీలోకి చేరిక భారీ ఎత్తున నిర్వహించే కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉంటారని చెబుతున్నారు. ఇప్పటికే మరో నేత వివేక్ ఢిల్లీలో ఉన్నారని.. నడ్డాను ఈటల కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లను ఆయన చూస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీలో తాను చేరితే తనకు ఒనగూరే ప్రయోజనాల విషయంలో ఈటల స్పష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఈటల ఎపిసోడ్ కు సంబంధించి ఈ రోజు కీలక పరిణామాలకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News