లెక్క‌రాసుకుంటున్నాం.. వ‌డ్డీతో స‌హా తీర్చేస్తాం!

Update: 2022-08-20 02:30 GMT
సీఎం కేసీఆర్‌ తీరుపై మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేస్తున్న ప‌నుల‌కు సంబంధించి అన్ని లెక్క‌లు  రాసుకుంటున్నామ‌ని వ‌డ్డీతో స‌హా తీర్చేస్తామ‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు.

టీఆర్ ఎస్‌లో తాను ఉన్నన్ని రోజులు ఏ కేసులు పెట్టలేదు కానీ బీజేపీలో చేరగానే కేసులు గుర్తొచ్చాయా అని మండిపడ్డారు. అన్నీ గుర్తించుకుంటామంటూ కేసీఆర్‌కు ఈటల వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారన్న ఈట‌ల ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా టీఆర్ ఎస్‌కు సహకరించటం సరికాదన్నారు.

బీజేపీలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దారుణమన్నారు. వేల సంఖ్యలో ఎంపీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు, ఎమ్మెల్యేలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా బీజేపీలో చేరే నాయకులను ఆపలేరని ఈట‌ల రాజేంద‌ర్‌ ధ్వజమెత్తారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరని వ్యాఖ్యానించారు. చౌటుప్పల్‌ ఎంపీపీ బీజేపీలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు.

కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆవేదన చెందారు. ''మీరు చేసిన తప్పులన్నీ లెక్కపెడుతున్నాం.. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం.'' అని హెచ్చరించారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే బీజేపీ కార్యకర్తలను కూడా వదలట్లేదని ఆరోపించారు. వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఈట‌ల హెచ్చ‌రించారు.
Tags:    

Similar News