అమెరికా ట్రిప్పా.. తర్వాత చూసుకోండి బాస్

Update: 2017-03-07 10:35 GMT
అమెరికా అంటే భూతల స్వర్గం. తమ దేశంలో అన్ని ప్రదేశాలూ చూసినా చూడకున్నా.. ప్రపంచంలోని మిగతా దేశాలేవీ కూడా చూడకపోయినా పర్వాలేదు.. జీవితంలో ఒక్కసారి అమెరికాను చుట్టి రావాలని కలలు కనే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. చాలా దేశాల వాళ్లకు విదేశం అంటే అమెరికానే. అంత క్రేజ్ తెచ్చుకుంది కాబట్టి ఏటా లక్షలాది మంది టూరిస్టుల్ని ఆకర్షిస్తుంది అమెరికా. ఇక ఉద్యోగ.. వ్యాపార రీత్యా అక్కడికెళ్లి స్థిరపడే వాళ్లు కోకొల్లలు. ఐతే ఇప్పుడు సీన్ మారుతోంది. అమెరికాకు వెళ్లడం ప్రమాదకరమని జనాలు ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ప్రభుత్వాలే ఈ విషయంలో జనాల్ని డిస్కరేజ్ చేస్తుండటం విశేషం.

ఇటీవలి కాలంలో ఐరోపా దేశాల నుంచి అమెరికా ప్రయాణాల్లో దాదపు 30 శాతం కోత పడ్డట్లు సమాచారం. తప్పదనుకుంటే.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అమెరికాకు వెళ్లొద్దంటూ ఐరోపా దేశాల అధినేతలే ప్రజలకు పిలుపునిస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికన్లలో లోకల్ ఫీలింగ్ బాగా ఎక్కువైపోవడం.. జాత్యాహంకారంతో దాడులు చేస్తూ ప్రాణాలు తీసేస్తుండటంతో ఇప్పుడు అమెరికా ఎంత మాత్రం సురక్షిత దేశంగా పరిగణనలో లేదు. ఆరు దేశాలపై ఆంక్షలు విధిస్తూ ఆర్డినెన్సుపై ట్రంప్ సంతకం కూడా చేసేసిన నేపథ్యంలో చాలా దేశాలు అమెరికా వైపు అనుమానంగా చూస్తున్నాయి. నైజీరియా ప్రభుత్వం సైతం అమెరికా పర్యటనలుంటే రద్దు చేసుకోవాలని.. కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు చూసుకుని అమెరికాకు వెళ్లొచ్చని తమ దేశస్థులకు స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా అన్ని దేశాల్లోనూ ట్రావెల్ ఏజెంట్ల వద్ద అమెరికన్ ట్రిప్పులకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. గతంలో ప్లాన్ చేసుకున్న ట్రిప్పుల్ని క్యాన్సిల్ చేసుకోలేక చాలామంది ఇప్పుడు అమెరికాకు వెళ్లిపోతుండొచ్చు కానీ.. ఓ రెండు మూడు నెలలు గడిచాక మాత్రం పరిస్థితి తీవ్రత స్పష్టంగా కనిపిస్తుందని.. దీని వల్ల ఏటా వందల కోట్లలో అమెరికా టూరిజంకు ఆదాయంలో కోత తప్పదని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News