ఓమిక్రాన్ రోగులకి ‘విపరీతమైన అలసట..లక్షణాలు ఇవే!

Update: 2021-11-30 12:30 GMT
ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ తాజాగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఈ కొత్త వేరియంట్ గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు న‌వంబ‌ర్ 25న ప్ర‌పంచానికి తెలియ‌జేశారు. డెల్టా కంటే రెండు మూడు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ ను ఆందోళనకర వేరియంట్‌ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 15కుపైగా దేశాలు ఈ వేరియంట్‌ బారినపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ మరో కరోనా వేవ్‌ పై భయాందోళన చెందుతున్నాయి.

ఒమిక్రాన్ వైర‌స్‌ ను మొద‌ట‌గా గుర్తించిన సౌత్ ఆఫ్రికా మెడిక‌ల్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు డాక్టర్ ఆంగెలిక్యూ కొయెట్జీ ఈ వేరియంట్‌ గురించి మరింత సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన 30 మంది వ్యక్తులను ఆమె నిశితంగా పరిశీలించి లక్షణాలను అంచనా వేశారు. ఇవి తెలియని లక్షణాలని, అయితే తేలికపాటివి అని ఆమె నిర్ధారించారు. కొత్త వేరియంట్‌ సోకిన వారు విపరీతమైన అలసటకు గురైనట్లు ఫిర్యాదు చేశారని డాక్టర్‌ కొయెట్జీ తెలిపారు. రోగులకు తేలికపాటి కండరాల నొప్పులు, బొంగుర గొంతు, పొడి దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే కొంతమందికి మాత్రమే కొంచెం ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత ఉందన్నారు.

మరోవైపు ఒమిక్రాన్ స్ట్రెయిన్ లక్షణాలు ఇతర కరోనా వేరియంట్‌ కంటే భిన్నంగా ఉన్నాయని డాక్టర్ కొయెట్జీ తెలిపారు. ఇవి మరింత తీవ్రమైన లక్షణాలకు దారి తీయవచ్చని చెప్పారు. తీవ్రమైన వ్యాధి రాదని మేము చెప్పడం లేదు. కానీ ప్రస్తుతానికి, టీకాలు తీసుకోని రోగుల్లో కూడా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి అని ఆమె పేర్కొన్నారు. ఐరోపాలో చాలా మంది ప్రజలు ఇప్పటికే ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారిన పడ్డారని డాక్టర్‌ కొయెట్జీ చెప్పారు. ఒమిక్రాన్ దాని వైరుధ్యం గురించి ఇంకా పూర్తిగా తెలియలేదన్నారు. బహుళ ఉత్పరివర్తనాల వల్ల అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వేరియంట్‌ వల్ల చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం గమనించాల్సిన అంశమన్నారు.

కొంతమందిలో మాత్రమే జ్వరం కలుగుతుంది. చికెన్ గున్యా ఒమిక్రాన్ కు చాలా వరకూ ఒకటే లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఇది మునుపటి వేరియంట్‌ ల కంటే ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడటం లేదు. కేవలం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు వ్యాపించింది. ఆస్ట్రేలియా , ఇటలీ , జర్మనీ , నెథర్లాండ్ , బ్రిటన్ , ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్ , బోట్స్వానా , బెల్జియం తదితర దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు మాత్రం ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నారు.



Tags:    

Similar News