రుణమాఫీ కావాలంటే రైతులు హైదరాబాద్‌ రావాలా?!

Update: 2015-04-11 05:39 GMT
తమ పాలన అంతా ఇంటర్నెట్‌ పాలన అని చెప్పుకొంటారు తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంటర్నెట్‌ టెక్నాలజీని ఉపయోగించుకొని పాలనను సరళరతం చేయడం.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తమకు తిరుగే లేదని ఆయన చెప్పుకొంటూ ఉంటారు. ఆయన మాటలు అలా ఉంటే.. తీరా అమల్లోకి వచ్చే సరికి చాలా విడ్డూరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.

    ఉదాహరణకు రైతు రుణమాఫీ అంశం గురించి ఫిర్యాదుల వ్యవహారాన్ని ప్రస్తావించవచ్చు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను రుణవిముక్తులను చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం వాళ్లు అధికారం చేతికి అందాకా మాత్రం మాఫీ వ్యవహారాన్ని ప్రహసనంగా మార్చారు.

    అనేక షరతులతో రుణమాఫీకి అర్హత పొందే రైతుల జాబితాను కత్తిరించిన చంద్రబాబు అండ్‌ కో అర్హులకు కూడా దశలవారీగా మాఫీ అంటున్నారు. మొదటి దశ అయిపోయింది.. ఇటీవల రెండో దశ అర్హుల జాబితాను ప్రకటించారు. అయితే  ఈ దశలో కూడా అర్హుల జాబితాలో తమ పేర్లు లేని రైతులు ఎంతో మంది ఉన్నారు. వారి నుంచి తీవ్ర నిరసన కనిపిస్తుండటంతో ప్రభుత్వం ఫిర్యాదు చేసుకోండి.. అని ప్రకటించింది.

    అయితే ఈ ఫిర్యాదు లోకల్‌గా మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. బ్యాంకుల్లోనో కాకుండా.. ఏకంగా హైదరాబాద్‌ కు వచ్చి చేయూలట!

    హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో రైతులు తమకు అర్హత ఉన్నా మాఫీ ప్రయోజనాలు అందలేదని.. ఫిర్యాదు చేసుకోవచ్చట! దీంతో వేలమంది రైతులు హైదరాబాద్‌ బాట పట్టారు. మాఫీ గురించి ఫిర్యాదులను అందజేస్తున్నారు!

    మరి రైతుల నుంచి నిజంగానే ఫిర్యాదులు తీసుకోవాలంటే ఈ రోజుల్లో ఎన్నో మార్గాలున్నాయి. అయినా కూడా జరుగుతుంతో లేదో తెలీని మాఫీ కోసం రైతులను ఇలా హైదరాబాద్‌ వరకూ రప్పించడం చాలా దారుణం.
Tags:    

Similar News