ఫైన‌ల్‌గా ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే ప‌వ‌న్ దృష్టి!

Update: 2022-10-11 07:08 GMT
గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంల్లో పోటీ చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయ‌న రెండో స్థానంలో నిలిచారు. ఈ రెండు చోట్లా వైసీపీ అభ్య‌ర్థులు తిప్ప‌ల నాగిరెడ్డి (గాజువాక‌), గ్రంథి శ్రీనివాస్ (భీమ‌వ‌రం) గెలిచిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాలంటూ కొన్నింటిపైన చ‌ర్చ జ‌రుగుతోంది. వీటిలో తిరుప‌తి, పిఠాపురం, అవ‌నిగ‌డ్డ‌, భీమ‌వ‌రం వంటివి ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

అయితే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలించిన పిమ్మ‌ట ఫైన‌ల్‌గా ప‌వ‌న్ పోటీ చేసేందుకు మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంపిక చేశార‌ని స‌మాచారం. వీటిలో తిరుప‌తి, కాకినాడ రూర‌ల్‌, పిఠాపురం ఉన్నాయి. ఈ మూడు నియోజ‌క‌వర్గాల్లోనూ కాపుల‌దే ఆధిప‌త్యం. ఇక స‌హ‌జంగానే మెగాభిమానులు కూడా ఎక్కువ‌.

కాకినాడ రూర‌ల్, పిఠాపురంల్లో ప్ర‌స్తుతం కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. కాకినాడ రూర‌ల్ నుంచి వైసీపీ త‌ర‌ఫున కుర‌సాల క‌న్న‌బాబు, పిఠాపురం నుంచి పెండెం దొర‌బాబు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇక తిరుప‌తి నుంచి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరుప‌తిలో గ‌తంలో వివిధ పార్టీల త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ‌మంది కాపులు (బ‌లిజ‌) కావ‌డం గ‌మ‌నార్హం. 2009లో తిరుప‌తి నుంచి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అత్య‌ధిక స్థానాలను గెలుచుకుని త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుగా తాను గెల‌వాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న పోటీకి అనుకూలంగా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి సారించార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కాకినాడ రూర‌ల్, పిఠాపురం, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఫైన‌ల్ చేశార‌ని అంటున్నారు.

ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కులాలవారీగా ఓటర్ల లిస్టుల‌ను కూడా సేక‌రించార‌ని.. ప‌వ‌న్ గెల‌వ‌డానికి ఉన్న స‌మీక‌ర‌ణాల‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఒక చోట నుంచి ప‌వ‌న్ పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News