కొత్త సచివాలయంలో కేసీఆర్ సంతకం పెట్టే తొలి ఫైల్ ఏది?

Update: 2023-04-27 15:00 GMT
సెలవురోజైన ఆదివారం కొత్త సచివాలయాన్ని ఓపెన్ చేస్తుండటం.. ఆ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన అధిపతులతో పాటు.. ముఖ్య ఉద్యోగులంతా ఆ రోజు ఫైళ్లు ఎప్పుడు చూడాలన్న దానిపై ముందస్తుగా సమాచారం ఇవ్వటం తెలిసిందే. అందరి సంగతి ఓకే.. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటేమిటి?ఆయన తన తొలి సంతకాన్ని ఏ ఫైల్ మీద పెట్టనున్నారు? అన్నది ప్రశ్నగా మారింది.

వందల కోట్ల ఖర్చుతో తన అభిరుచికి తగ్గట్లుగా కట్టించుకున్న సచివాలయ భవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చూసే మొదటి ఫైల్ పైన ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలో దళిత బంధుకు సంబంధించిన ఫైల్ మీద సీఎం సంతకం పెడతారన్న మాట వినిపిస్తోంది. దళితబంధు -2 ఫైల్ మీద సంతకం చేస్తారా? ఇదేమీ కాకుండా మరో కొత్త ఫైలు మీద సంతకం చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యన మంత్రిహరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మే 1టిన భవన కార్మికులకు సరికొత్త పథకాన్ని సిద్ధం చేసిందని.. దానికి సంబంధించిన వివరాల్ని మే 1న ప్రకటిస్తారని చెప్పటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దళిత బంధు 2 ఫైలా.. కొత్త సంక్షేమ పథకానికి సంబంధించిన ఫైలా? అన్న దానిపై భారీ చర్చ జరుగుతోంది. ఇవే కాకుండా పోడు హక్కుపట్టాల పంపిణీ.. సొంత జాగా ఉన్న వారి ఇంటినిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించే ఫైల్ మీద సంతకం చేస్తారా? అన్నది కూడా చర్చ నడుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లింది లేదు. మొదట్లో అప్పుడప్పుడు వెళ్లిన ఆయన.. ఆ తర్వాత వెళ్లటం పూర్తిగా మానేశారు. 2016 నవంబరు చివరి వారం తర్వాత నుంచి కేసీఆర్ సచివాలయానికి వెళ్లకపోవటం తెలిసిందే. ఆ తర్వాత పాత సచివాలయాన్ని కూల్చేయటం.. దాని స్థానంలో బీఆర్కే భవన్ లో సచివాలయాన్ని ఏర్పాటు చేసినా.. అక్కడకు వెళ్లింది లేదు.

ఈ నేపథ్యంలో కొత్త సచివాలయానికి 2019 జూన్ 27న శంకుస్థాపన చేశారు. రికార్డు స్థాయిలో వేగంగా నిర్మాణం చేపట్టి కొత్త సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయటంతో పాటు.. అన్ని హంగులతో సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయంలో మొదటి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చూసే మొదటి ఫైల్ ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Similar News