ఆ రెండు గ్రామాలపై దండెత్తిన ఈగలు.. కారణం ఏంటంటే?

Update: 2021-07-03 03:42 GMT
సహజంగా పాములు పగబడతాయి. విష సర్పాలను చూసి పిల్లల నుంచి పెద్దల దాకా హడలిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఓ రెండు గ్రామాల్లో మాత్రం ఈగలను చూసి వణికిపోతున్నారు. ఈగలకు భయం ఎందుకు అంటారా? పదుల సంఖ్యలో ఈగలు ఉంటే ఏమో కానీ మందలాగా చెవుల చుట్టూ గుయ్  గుయ్ మని అరుస్తూ ఉంటే భయపడాల్సి వస్తుంది మరి.

మనం ఈగలే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఈగలు సర్వ రోగాల వ్యాప్తికి కారణం అవుతాయి. ఒకటి రెండు ఈగలు మూగితే వాటిని తరిమేయొచ్చు. కానీ వందల సంఖ్యలో వస్తే వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. మరీ ఇంతలా ముసిరితే తిండి కాదు కదా గాలి కూడా స్వేచ్ఛగా తీసుకులేం. అయితే ఆ రెండు గ్రామాల మీద ఈగలు పగబట్టాయా? అనే తరహాలు ఉన్నాయి. ఎక్కడా చూసినా ఈగల గోలనేనని స్థానికులు వాపోయారు.

ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కొళ్లపల్లె, కొంగనపల్లెలపై ఈగలు పగబట్టాయి. అసలే వర్షాకాలంలో సహజంగా ఈగలు ముసురుతాయి. కానీ ఆ రెండు ఊర్లలో మాత్రం ఎక్కడ చూసినా మందలకు మందలే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం భోజనం చేసే స్వేచ్ఛ లేకుండా ఉందని వాపోయారు.

ఆ రెండు పల్లెల్లో ఈగల బెడద ఎక్కువ కావడానికి చాలా కారణాలు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. తమ గ్రామాల చుట్టూ కోళ్ల ఫారాలు ఉన్నాయని తెలిపారు. వాటి నుంచి వెలువడే వ్యర్థాలను ఊరు చుట్టూ వేయగా... ఈగల బాధ ఎక్కువైందని చెబుతున్నారు.

ఇంట్లో కూర్చున్నా, వంట చేస్తున్నా ఈగల బాధ భరించలేకపోతున్నామని వాపోయారు. రాత్రి పగలు తేడా లేకుండా చుట్టూ ముసురుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే కరోనా పైగా వర్షాకాలం ఇలా ఈగల సమస్య పెరిగిపోయిందని అంటున్నారు. వీటివల్ల తాము రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు.

గ్రామస్థులు తినే ఆహారం, తాగే నీటిని కలుషితం చేస్తున్నాయని అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే తాము ఎన్నో రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వాపోయారు. కోళ్ల ఫారాల నుంచి వచ్చే దుర్గంధం, ఈగల బెడద నుంచి తమను విముక్తులను చేయాలని వేడుకుంటున్నారు.

దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే పిల్లలు, పెద్దలు ఎన్నో సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారు. అంతేలెండి కాలం కలిసిరాకపోతే తాడే పాము అయినట్లు... ఈగలే ఇలా హడలెత్తిస్తాయి.

కేవలం ఆ రెండు గ్రామాల్లోనే కాకుండా ఇతర పల్లెల్లోనూ అధికారులు తగు చర్యలు చేపట్టాలి. అసలే కరోనా మరోవైపు వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ కాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంది. ప్రజలూ ఆహారం, తాగు నీటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
Tags:    

Similar News