దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణాల్లో ఒకటైన రూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఇవాళ రాంచీలోని సీబీఐ స్పెషల్ జడ్జి ఈ కేసులో తీర్పును వెలువరించారు. వచ్చే ఏడాది జనవరి మూడవ తేదీన జైలు శిక్షను ఖరారు చేయనున్నారు. డియోఘర్ ట్రెజరీ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం నిర్దోషిగా బయటపడ్డారు. లాలూప్రసాద్ యాదవ్‌ను కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించనున్నారు. దాణా కుంభకోణం కింద మొత్తం 5 కేసులు ఉన్నాయి. అందులో ఇవాళ డియోఘర్ కేసులో తీర్పును వెలువరించారు. మరో 15 మందికి కూడా జనవరి 3నే శిక్షను ఖరారు చేస్తారు.
కాగా ఈ తీర్పుకు ముందు మీడియాతో మాట్లాడుతూ లాలూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. దాణా కుంభకోణంలో తీర్పు ఎలా ఉన్నా.. బీహార్ ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదు అన్నారు. సీబీఐ కోర్టు ముందు హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంగా లాలూ ఈ విధంగా స్పందించారు.
కాగా, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో 1990 నుంచి 1997 వరకు పశుసంవర్థకశాఖలో పశు దానాకు సంబంధించి రూ.1000 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. పశుదాణా కుంభకోణం కేసుకు సంబంధించి అక్టోబర్ 3 - 2013లో సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవడంతో పాటు పదకొండేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు.