బాబును భ‌య‌పెట్టిన ఆ ఆడియోలో ఏముంది?

Update: 2018-05-08 05:38 GMT
ఓటుకు నోటు కేసులో కీల‌కం బాబు మాట్లాడిన‌ట్లుగా చెప్పే ఆడియో టేప్‌. మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ కు ముడుపులు ఇచ్చి త‌మ‌కు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్ర‌లోభ పెట్ట‌టం.. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

స్టీఫెన్ స‌న్ ఇంటికి వెళ్లిన నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి డ‌బ్బు సంచి ఇచ్చిన వైనం కెమేరా సాక్షిగా దొరికిపోవ‌టం.. ఆ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోసంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ అప్ప‌ట్లో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. అనంత‌రం ఈ కేసు విచార‌ణ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని చెబుతూ.. ఒక ఆడియో టేప్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్టీఫెన్ స‌న్ ను ప్ర‌లోభ పెట్టేలా ఉన్న ఆడియో టేప్ లో వినిపించిన వాయిస్ బాబుదేన‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో బాబును అధికారులు ప్ర‌శ్నిస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది.

దీంతో  రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ కేసు నేప‌థ్యంలోనే బాబు హ‌డావుడిగా అమ‌రావ‌తికి త‌ర‌లివెళ్లార‌ని.. హైద‌రాబాద్‌ను ఖాళీ చేసిన‌ట్లుగా చెబుతారు. తాజాగా.. ఈ కేసు మీద ముఖ్య‌మంత్రి కేసీఆర్ రివ్యూ చేయ‌టంతో ఈ పాత వ్య‌వ‌హారం స‌రికొత్త‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌ధాని మోడీపై విరుచుకుప‌డుతున్న చంద్ర‌బాబును రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకు వీలుగా ఓటుకు నోటు కేసును తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఏ ప‌రిణామం చోటు చేసుకున్నా.. అందుకు బాబు మాట్లాడిన‌ట్లుగా చెప్పే ఆడియో టేప్ కీల‌కంగా మార‌నుంది. ఈ టేప్ లో ఉన్నది చంద్ర‌బాబు వాయిసేన‌ని ఛండీగ‌ఢ్ ఫోరెన్సిక్ సంస్థ తేల్చిన నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌లు మ‌రింత పెరిగేఅవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

గ‌డిచిన కొన్నేళ్లుగా ఈ కేసు ఊసు ఎత్త‌ని కేసీఆర్ ఇప్పుడు ఏకంగా రివ్యూ చేయ‌టం.. ఎలాంటి ఒత్తిళ్లు ఉండ‌వంటూ కేసీఆర్ అభ‌యం ఇవ్వ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓటుకు నోటు కేసుకు సంబంధించి కీల‌కంగా చెబుతున్న బాబు "బ్రీఫ్ డ్ మీ" ఆడియో టేప్ లో ఏముంది?  బాబు ఏం మాట్లాడారు అన్న‌ది చూస్తే..

సెబాస్టియన్‌ (బాబు అనుచరుడు): హలో

స్టీఫెన్‌సన్‌: యా బ్రదర్‌..

సెబాస్టియన్‌: బాబు గారు గోయింగ్‌ టు టాక్‌ టూ యు, బి ఆన్‌ ద లైన్‌ (బాబు గారు మీతో మాట్లాడుతారు మీరు లైన్‌లో ఉండండి)

స్టీఫెన్‌సన్‌: యా  

చంద్రబాబు: హలో..

స్టీఫెన్‌సన్‌: సర్‌ గుడ్‌ ఈవెనింగ్‌ సర్‌..

చంద్రబాబు: ఆ.. గుడ్‌ ఈవెనింగ్‌ బ్రదర్, హౌ ఆర్‌ యూ

స్టీఫెన్‌సన్‌: ఫైన్‌.. థ్యాంక్యూ సర్‌

చంద్రబాబు: మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ.. ఐయామ్‌ విత్‌ యూ.. డోంట్‌ బాదర్‌ (మనవాళ్లు నాకు అంతా వివరించారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిన పని లేదు)

స్టీఫెన్‌సన్‌: యస్‌ సర్‌.. రైట్‌ సర్‌

చంద్రబాబు: ఫర్‌ ఎవ్రీ థింగ్‌ ఐ యాం విత్‌ యు, వాట్‌ ఆల్‌ దే స్పోక్‌ విల్‌ హానర్‌ (దేనికైనా మీకు నేను అండగా ఉంటాను. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తా)

స్టీఫెన్‌సన్‌: ఎస్‌ సార్‌.. రైట్‌ సార్‌..

చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్‌ డిసైడ్‌.. నో ప్రాబ్లం ఎట్‌ ఆల్‌ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.. ఎలాంటి సమస్యా లేదు)

స్టీఫెన్‌సన్‌: ఎస్‌ సర్‌

చంద్రబాబు: దట్‌ ఈజ్‌ అవర్‌ కమిట్‌ మెంట్‌ వుయ్‌ విల్‌ వర్క్‌ టుగెదర్‌ (అది మా హామీ.. మనం కలసి పని చేద్దాం)  

స్టీఫెన్‌సన్‌ : రైట్‌...థాంక్యూ సర్‌..

చంద్రబాబు: థాంక్యూ.


Tags:    

Similar News