ఇద్ద‌రు చంద్రుల‌కు ఇదే కీల‌కం !

Update: 2018-12-05 17:42 GMT
ఒక్కోసారి ఏదో అనుకుని మొద‌లుపెడ‌తాం. కానీ ఇంకేదో అవుతుంటుంది. ఆ ఇంపాక్ట్ ఊహ‌ల‌కు అంద‌డం కూడా క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప‌రిస్థితిని విశ్లేషిస్తే... అస‌లు చంద్ర‌బాబు  చంద్ర‌శేఖ‌ర్‌రావు భ‌విష్య‌త్తును అంచ‌నా వేసిన  త‌ర్వాతే ఈ స్టెప్ తీసుకున్నారా? లేక ఏదో ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని తీసేసుకున్నారా? అని అనుమానం క‌లుగుతుంది. ఎందుకంటే ఇద్ద‌రిదీ పులిమీద స‌వారీయే. ఇక్క‌డ టీఆర్ఎస్‌- కాంగ్రెస్‌-టీడీపీ-బీజేపీ-టీజేఎస్‌-క‌మ్యూనిస్టులు బ‌రిలో ఉన్నాయి. టీఆర్ఎస్‌కు -టీడీపీకి ఈ ఎన్నిక‌లు ప్రాణాంత‌కం. మిగ‌తా పార్టీల‌కు పెద్ద ఫ‌ర‌క్‌లేదు. ఎలాగో చూద్దాం.

చంద్ర‌బాబు... తొలుత ఇందులో ఒక అవ‌కాశాన్ని చూశారు. ప్ర‌జా కూట‌మి పొత్తు కుదిరితే, పార్టీ ఉనికి నిల‌బ‌డుతుంది. టీడీపీ క్యాడ‌ర్ ని కాపాడుకోవ‌చ్చు. బోన‌స్‌గా ఎన్నో కొన్ని సీట్లు కూడా వ‌స్తాయి.  కానీ ఓడిపోతే ఏంటి అని ఆలోచిస్తేనే అది భ‌యంక‌రంగా ఉంది. ఎందుకంటే... ఈసారి ఇక్క‌డ ప్ర‌జాకూట‌మి అధికారంలోకి రాక‌పోతే... చంద్ర‌బాబు భ‌విష్య‌త్తు ఏంటో ఇక్క‌డే డిసైడ్ అయిపోతుంది. ఇప్ప‌టికే ఏపీ నేత‌ల్లో లుక‌లుక‌లు పెరిగాయి. జగన్ హ‌వా ఉంది, జ‌న‌సేన ఆప్ష‌న్ ఉంది. పైగా సిట్టింగులు మారుస్తార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో విప‌రీతంగా వ‌ల‌స‌లు పెరుగుతాయి. అవినీతి ఆరోప‌ణ‌లు ఇంకా పెరుగుతాయి. ఏపీ క్యాడ‌ర్ మాన‌సిక స్థైర్యం దెబ్బ‌తింటుంది. బాబుపై పార్టీలో గౌర‌వం త‌గ్గుతుంది. ఇక జాతీయ స్థాయిలో దాని ప్ర‌భావం ఇంకా ఘోరంగా ఉంటుంది. నేనే అది నేనే అని జాతీయ పార్టీల‌తో తిరుగుతున్న చంద్ర‌బాబును ఇపుడే స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక్క‌డ గెల‌వ‌క‌పోతే బాబు వ‌ల్ల ఉప‌యోగం శూన్యం అని భావించే పరిస్థితి ఉంటుంది. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతాయి. ఓటింగ్ స‌ర‌ళిని గ‌ణ‌నీయంగా మారుస్తాయి. అందుకే ప్ర‌జాకూట‌మి ఓడితే..బాబు భ‌విష్య‌త్తు అంధకార‌మే.

చంద్ర‌శేఖ‌ర్ రావు... ఇపుడు పొత్తుల అవ‌స‌రం ఏమొచ్చింది. తెలంగాణలో పెట్టిన‌న్ని ప‌థ‌కాలు ఇంకెక్క‌డా లేవు. ఇపుడు కూడా నాకు ఓట్లేయ‌క‌పోతే ఇంకెవ‌రికి వేస్తారు అన్న‌ది కేసీఆర్ కాన్ఫిడెన్స్‌. మ్యానిఫెస్టోలో హామీలు మాత్ర‌మే కాకుండా అందులో లేని హామీలు కూడా ప్ర‌క‌టించిన త‌నను తెలంగాణ ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని కేసీఆర్ భావించారు. అందుకే నో పొత్తులు అనేశారు. గెలిస్తే...ఓకే, తిరుగులేదు. ఒక వేళ ఓడితే... ఆయ‌న‌కు మొద‌టి శ‌త్రువు మీడియా అవుతుంది. ఎందుకంటే... తాను ప్ర‌జ‌లు కోసం బతుకుతున్నాను. ఎవ‌రినీ ఖాత‌రు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని మీడియా వాళ్ల‌ని ప‌ట్టించుకోలేదు. పైగా మీడియాకే కౌంట‌ర్లు వేసి వారు నోరుమూయించేవారు. ఇక కాంగ్రెస్ నేత‌లు కూడా కేసీఆర్ ప‌ట్ల చాలా ఆగ్ర‌హంగా ఉన్నారు. త‌మను ఉక్కిరిబిక్కిరి చేశాడ‌ని, ఉనికి లేకుండా చేసే ప్ర‌య‌త్నం చేశాడ‌ని కోపంతో ఉన్నారు. కేసీఆర్ అవినీతి త‌గ్గించాడు అని ప్ర‌జ‌ల్లో ఇంప్రెష‌న్ ఉంది కానీ దానికి బాగా అల‌వాటు ప‌డిన చోటా లీడ‌ర్ల‌లో కేసీఆర్‌పై కోపం ఉంది. వారు కూడా మెల్ల‌గా కాంగ్రెస్ వైపు చూసే అవ‌కాశాలున్నాయి. ఇక ఈ ఫలితాలు వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను కూడా బాగా ప్ర‌భావితం చేస్తాయి. వీటన్నింటి వ‌ల్ల పార్టీ నిర్మాణం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అందుకే... ఇద్ద‌రికీ ఈ ఎన్నిక‌లు ప్రాణ‌సంక‌ట‌మే. మిగ‌తా పార్టీల‌కే పోయినా పెద్ద‌గా వ‌చ్చేదేమీ లేదు. న‌చ్చితే పార్టీలో ఉంటారు...లేక‌పోతే అధికార పార్టీలోకి జంప‌వుతారు. అంతే!
Tags:    

Similar News