ఏపీకి ప్రత్యేక హోదాపై అధికార టీడీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం మొత్తం ఉద్యమంలోకి దూకేసిన సమయంలో టీడీపీ ఎంపీలు ఏకంగా పార్లమెంటు వేదికగానే పోరు బాట కొనసాగించారు. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనని వారు గళమెత్తారు. అయితే ఇవేమీ పట్టని ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాత్రం... ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి ఒకే అనేశారు. ప్రత్యేక హోదాకు సరిసమానంగా ఉందనే ప్రత్యేక ప్యాకేజీకి తాను ఒప్పుకున్నానని ఆయన కొత్త వాదనను వినిపించారు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించే విషయాన్ని పక్కనపడేసిన ఆయన కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు. కేంద్రం ఇచ్చింది తీసుకుని... ఆపై మరికొన్నింటి కోసం పోరాడదామని ఆయన చెబుతున్న మాటలపై విపక్షాలు విరుచుకుపడుతుండగా, తన సొంత పార్టీలోనే ఆయనకు నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు బహాటంగానే చంద్రబాబుకు దెబ్బలేసేశారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత - చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సీనియర్ రాజకీయవేత్త - ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి వంతు వచ్చేసింది.
నిన్న విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సమావేశంలో చంద్రబాబు... ప్రత్యేక హోదాపై తనదైన శైలి వాదనను వినిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులను ఏకరువు పెట్టిన కేంద్ర ప్రభుత్వం తమ ముందు కొన్ని ప్రత్యామ్నాయాలను పెట్టిందని, ఈ క్రమంలో ప్రత్యేక హోదాకు సరిసమానంగా ఉన్న ప్రత్యేక ప్యాకేజీకి తాను ఒప్పుకున్నానని చెప్పారు. అంతేనా... అసలు ప్రత్యేక హోదా రాకపోతే నష్టమేమీ లేదన్న కోణంలోనూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పోరుబాట పట్టిన తమిళ తంబీలు జల్లికట్టుకు అనుమతి సాధించుకున్న తరుణంలో ఏపీలోనూ ప్రత్యేక హోదా కోసం మలి ఉద్యమం ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో అసలు జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు సంబంధమేంటని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే... రాష్ట్రం ఏమైపోయినా తనకేమీ బాధ లేనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని సాక్షాత్తు ఆయన సొంత పార్టీ నేతలే అనుకునే పరిస్థితి.
అటు విజయవాడలో చంద్రబాబు మీడియాతో మాట్లాడిన సమయంలోనే ఇటు హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా ముందుకు వచ్చిన గాలి ముద్దు కృష్ణమనాయుడు... చంద్రబాబు వ్యాఖ్యలకు విరుద్ధంగా స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నదే తమ అందరి డిమాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన వినతిలో ప్రత్యేక హోదానే తొలి ప్రాధాన్య అంశంగా ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో గాలి వ్యాఖ్యలు చంద్రబాబుకు పెద్ద దెబ్బేనని చెప్పాలి. అంతేకాకుండా ఈ నెల 26న విశాఖ తీరంలో వైసీపీ చేపట్టనున్న హోదా ర్యాలీకి మద్దతునిచ్చేలానే గాలి వ్యాఖ్యలు ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అంటే... టీడీపీ నేతగా ఉన్న ముద్దుకృష్ణమ... ప్రత్యేక హోదా కోసం జగన్ బాటలో నడిచేందుకే సిద్ధమన్నట్లుగా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనా లేకపోలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/