సుప్రీం.. శిశుపాలుడు.. రోజా.. గాలి

Update: 2016-04-23 04:55 GMT
సంబంధం లేనట్లుగా కనిపించే ఈ నాలుగు పదాలకు చాలానే లింకులున్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన పరుష వ్యాఖ్యలతో ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిందంటూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఉదంతంపై  విచారణ జరిపిన సుప్రీం.. రోజా క్షమాపణ చెప్పాలని.. ఆమె క్షమాపణల్ని ఏపీ స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని చెబుతూనే.. చట్టసభ తీసుకున్న నిర్ణయాన్ని తాము జోక్యం చేసుకోవటం లేదంటూ ఆచితూచి వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా రోజా మొదటిసారి ఎంపికైన ఎమ్మెల్యే అని.. ఆమె చేసిన వ్యాఖ్యలపై చెప్పే క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలంటూ శిశుపాలుడు చేసిన వంద తప్పుల్ని శ్రీకృష్ణుడు భరించారన్నరీతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. పురాణాల్లోని శిశుపాలుడిని ప్రస్తావించిన సుప్రీం మాటను.. రోజా తీరును తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు.

శిశుపాలుడన్న పదాన్ని ఎవరిని ఉద్దేశించి సుప్రీం ప్రస్తావించిందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ జగన్ కు సూచన చేసిన గాలి.. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అసభ్య పదాల్ని వాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మాటలు చెబుతూనే రోజా మీద ఘాటైన విమర్శలు చేయటం గమనార్హం. నడుం చూపటం.. నాలుక మడతపెట్టి అసభ్యంగా వ్యవహరించటం.. కాలు ఎత్తటం.. ఇలాంటి వాటికి సంబంధించిన దృశ్యాల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చూసిన తర్వాత మాత్రమే సుప్రీం శిశుపాలుడు ప్రస్తావన తీసుకొచ్చిన విషయాన్ని మర్చిపోకూడదని గాలి చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రోజా తాను చేసిన తప్పుల్ని గుర్తించి సారీ చెప్పాలని వ్యాఖ్యానించారు. అదే ఉంటే రోజా ఇష్యూ ఇక్కడ వరకూ వచ్చేదా?
Tags:    

Similar News