కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ రాజీనామా.. ఉమ్మడి ఏపీతో బంధం

Update: 2022-08-26 07:08 GMT
కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు.. వరుసగా సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అగ్ర నేతగా పరిగణించదగ్గ గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆజాద్‌ వెల్లడించారు. దీంతో దశాబ్దాలుగా కాంగ్రెస్ తో పెనవేసుకున్న బంధానికి తెరపడినట్లయింది. కాంగ్రెస్ అంటేనే గులాం నబీ ఆజాద్, గులాం నబీ ఆజాద్ అంటేనే కాంగ్రెస్ అని ఇప్పటివరకు ఉండేది. అలాంటి ఆజాద్ కొంతకాలంగా అసమ్మతితో ఉన్నారు. పార్టీలో సమూల ప్రక్షాళన కోరుతూ నిరుడు నిరసన గళం వినిపించిన జి-23 నేతల్లో గులాం నబీ ఒకరు. ఇటీవల సైతం కాంగ్రెస్ జమ్మ కశ్మీర్ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించిన వెంటనే తనకు ఆ బాధ్యతలు వద్దంటూ తిరస్కరించి సంచలనం రేపారు. ఈలోగానే మొత్తం పార్టీకే రాజీనామా చేశారు.

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గతంలో తెరపైకి గులాం నబీ అజాత శత్రువు. అన్ని పార్టీల నాయకులతోనూ ఆయనకు సంబంధాలున్నాయి. ఈ కోణంలోనే ఆజాద్ ను ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఈ ఏడాది మొదట్లో వార్తలు వచ్చాయి. ప్రధాని మోదీతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనూ ఈ కథనాలకు బలం చేకూరింది. ఆజాద్ రాజ్య సభ సభ్యుడిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో మోదీ భావోద్వేగానికి గురికావడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.

గులాం నబీతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు మోదీ ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు. అదీ ఆజాద్ స్థాయి. అయితే, దశాబ్దాలుగా కాంగ్రెస్ కు నమ్మిన బంటుగా ఉన్న ఆజాద్ ఎందుకనో కొన్నేళ్లుగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. చాలాకాలం పాటు పార్టీలో, పదేళ్లు యూపీఏ ప్రభుత్వంలో పదవులు అనుభవించి కాంగ్రెస్ ను వీడిన నేతల జాబితాలో గులాం నబీ చేరిపోయారు.

ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జిగా గులాం నబీ ఆజాద్ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పూర్తి కష్ట కాలంలో ఉన్న ఆ సమయంలో తనదైన శైలిలో వ్యవహరించి గ్రూపులను ఒకదారికి తెచ్చారు. దీంతోనే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమష్టిగా పోరాడి విజయం సాధించగలిగింది. 2004లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్.. ఆ తర్వాత సంవత్సరమే (2005) కశ్మీర్ ముఖ్యమంత్రి కావడం ఇక్కడ విశేషం. 2008 తర్వాత తిరిగి కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన గులాం నబీ 2014లో పార్టీ ఓడిపోయేవరకు పదవులు చేపట్టారు. 2014 తర్వాత ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. కాంగ్రెస్ ముఖ్య వ్యూహకర్తల్లో ఒకరైన గులాం నబీ ఏపీనే కాక పలు రాష్ట్రాల బాధ్యతలనూ చూశారు. అలాంటి వ్యక్తి పార్టీని వదిలి వెళ్లడం అంటే.. కష్ట కాలంలో చేయివ్వడమే.

తదుపరి ఏమిటి? మోదీ ప్రభుత్వంలోకా? 73 ఏళ్ల ఆజాద్ జమ్ము కశ్మీర్ కు చెందినవారు. ఆ రాష్ట్రంలో ప్రభావం చూపగల నేత.  ఆయన మోదీకి సన్నిహితుడు. ఈ కోణంలో బీజేపీ ఆజాద్ సేవలను వినియోగించుకోవాలని భావించవచ్చు. ఆజాద్ ను ఉప రాష్ట్రపతి చేయలేకపోయినా..

కశ్మీర్ ఎన్నికలకు బీజేపీ తురుపుముక్కగా వాడుకోవచ్చు. కశ్మీర్ కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగుతాయని అంటున్నారు. వాటికి ఆజాద్ ను ముందుపెట్టి ప్రజలను ఆకట్టకునేందుకు బీజేపీ ఎత్తుగడ వేసే అవకాశం ఉంది. లేదంటే ఆజాద్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. ఇటీవలే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా రాజీనామా చేయడంతో  ఎలాగూ ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం లేదు. దీనిని ఆజాద్ తో భర్తీ చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News