రాజధాని పై మూడు కమిటీల నిర్ణయం ఇదే..ఏంటంటే ?

Update: 2020-01-20 05:50 GMT
ప్రస్తుతం ఏపీ మూడు రాజధానుల విషయంలో అట్టుడికిపోతోంది. ప్రభుత్వం మూడు రాజధానులకి మార్గం సుగమం చేస్తుంటే ..ప్రతిపక్షం మాత్రం అమరావతి ఒక్కటే రాష్ట్ర రాజధానిగా ఉండాలి అంటూ ప్రభుత్వం పై పోరాటం చేస్తుంది. అయితే , రాష్ట్ర విభజన అనంతరం రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీతో పాటు ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ - బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు  నివేదికలన్నీ పరిపాలన వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాయి. న్యాయ - పరిపాలన - శాసన వ్యవస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశాయి. గత ప్రభుత్వం రూపొందించిన అమరావతి మెగా సిటీ నిర్మాణం సాధ్యం కాదని - మెగా సిటీల నిర్మాణం కాన్సెప్ట్‌ ప్రపంచంలో విఫలమైందని తెలిపాయి. అత్యధిక శాతం ప్రజలు పాలన - అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నట్టు తెలిపాయి.

శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసులు :

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని నగరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదని స్పష్టం చేసింది. విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. ఉత్తరాంధ్ర - కోస్తాంధ్ర - రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి.  ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు - ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.

జీఎన్‌ రావు కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు :

శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉండే పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్యా ఉండదు.  అమరావతి ప్రాంతంలో కొంత వరద ముంపునకు గురవుతుంది. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించరాదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి.

బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు  సిఫార్సులు :

పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా - సులభంగా పౌర సేవలు అందుతాయి.  ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ - వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు - సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. సచివాలయానికి ఏడాదిలో మొత్తం లక్ష మంది వస్తే అందులో 75 శాతం మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు.  అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ - నెల్లూరు - ప్రకాశం - గుంటూరు జిల్లాలకు సాగు - తాగు నీరు అందించేందుకు పోలవరం – బొల్లాపల్లి– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు - రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 సంవత్సరం వరకు 30కి పైగా గ్రీన్‌ ఫీల్డ్‌ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ విఫలమయ్యాయి. కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50% సాధించాయి. మిగతావన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతం కూడా చేరుకోలేదు. 
Tags:    

Similar News