గూగుల్ ఉద్యోగి అనే బదులు గుండు కోడలు అనొచ్చుగా

Update: 2016-03-02 06:15 GMT
కొంతమంది రాజకీయ నేతలు చాలా తెలివైనోళ్లు. సమయానికి తగ్గట్లుగా ప్రచారం చేసుకుంటూ లబ్థి పొందుతారు. రాజకీయ రంగానికి చెందిన వారసుల్ని అలా ఫోకస్ చేసే కన్నా.. ఓ పెద్ద కంపెనీలో ఉన్నత ఉద్యోగిగా చూపించి.. ప్రజాసేవ చేసేందుకు అంత పెద్ద ఉద్యోగాల్ని వదిలేసి మరీ.. ఎన్నికల బరిలోకి దిగారంటే ఆ వచ్చే ప్రచారం మా గొప్పగా ఉంటుంది. లక్షల రూపాయిల ఉద్యోగాల్ని వదిలేసి ప్రజాసేవ చేయటానికి ఎంతలా ముందుకొచ్చారని మురిసిపోయే ముందు.. అలాంటి వాళ్లకు సంబంధించి అసలు విషయాల మీద ఫోకస్ చేస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.

తాజాగా జరుగుతున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారాన్నే చూడండి. ఈ ఎన్నికల్లో ప్రఖ్యాత గూగుల్ లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అశ్రితా రెడ్డి అధికార టీఆర్ ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగారు. ఆమెను.. గూగుల్ ఉద్యోగిగానే ఫోకస్ చేశారు. మీడియాలోనూ కాస్త అలాంటి వార్తలే వచ్చాయి. ఇంతకీ ఈ అశ్రితా రెడ్డి ఎవరన్న విషయం మీద దృష్టి పెడితే.. కాస్త ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా బరిలోకి దిగిన అశ్రిత రెడ్డి ఎవరో కాదు.. ఆ మధ్య వరకూ తెలుగుదేశంలో ఉండి టీఆర్ ఎస్ లో చేరి గుండు సుధారాణి కోడలు. సుధారాణి కొడుకు అశ్రితాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొడుకు సైతం ఐటీ ఎంప్లాయి గానే పని చేస్తుంటే.. తమ కుటుంబానికి సంబంధించి టిక్కెట్టు చేజిక్కించుకోవటానికి అత్తగారు ప్రయత్నాలు జరిపిన ఫలితంగా కోడలకు టిక్కెట్టు వచ్చిందన్న విషయాన్ని చెబుతున్నారు.

గుండు సుధారాణి కోడలు అనే కన్నా.. గూగుల్ ఎంప్లాయ్ అన్న ప్రచారానికే మైలేజ్ ఎక్కువ వస్తుందని భావించారేమో కానీ.. కోడల్ని తన వారసురాలిగా కంటే కూడా గూగుల్ ఉద్యోగిగా ఫోకస్ చేయించిన గుండు తెలివితేటలకు మిగిలిన రాజకీయ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ట్రెండ్ కు తగినట్లుగా నడవటం వల్ల కలిగే ప్రయోజనం గుండు సుధారాణికి బాగానే తెలిసినట్లుంది. ఏమైతేనేం.. తన వారసురాలిగా కోడల్ని దింపి.. గూగుల్ ఉద్యోగినిగా ప్రచారం చేసిన గుండు సుధారాణి ఐడియా ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందో.. ఫలితాలు వెల్లడయ్యే వరకూ వెయిట్ చేస్తే సరి.
Tags:    

Similar News