మరి కేసీఆర్ సైంటిస్ట్ నా?

Update: 2022-07-26 23:30 GMT
తెలంగాణలో విడవని వానలు.. వరదలకు ‘క్లౌడ్ బరెస్ట్’ కారణమని..ఇది విదేశీయులు చేసిన కుట్రగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. అప్పటి నుంచి ఇరువైపులా రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ విమర్శలకు తొలి విమర్శను గవర్నర్ తమిళిసై చేశారు. ఇక బీజేపీ నేతలు దీన్ని అందుకున్నారు. దీంతో కేసీఆర్ ‘క్లౌడ్ బరెస్ట్’ తెలంగాణ రాజకీయాల్లో బరెస్ట్ అయ్యింది.

కేసీఆర్ కు కౌంటర్ గా క్లౌడ్ బరస్ట్ పై గవర్నర్ తమిళిసై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ ఆరోపణలను ఆమె ఖండించారు. కేసీఆర్ పర్యటించిన రోజే గవర్నర్ కూడా భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోనే పర్యటించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. బాధితులను పరామర్శించారు. గోదావరికి వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్  అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తమిళి సై అన్నారు.నదీ పరివాహక ప్రాంతంలో  ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తూనే వస్తున్నాయని.. వాటి ఫలితంగా వరదలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆ సీజన్ లో వరదల తీవ్రత అధికంగా ఉంటుందని తమిళి సై క్లారిటీ ఇచ్చారు. దీనికి క్లౌడ్ బరస్ట్ అని పేరు పెట్టడంలో అర్థం లేదని తేల్చిచెప్పారు.  లఢక్, ఉత్తరాఖండ్ లలో క్లౌడ్ బరెస్ట్ ప్రతి సంవత్సరం సంభవిస్తుంటాయని..తెలంగాణలో అలాంటి అవకాశాలు లేవని తమిళిసై క్లారిటీ ఇచ్చారు.

గోదావరికి సంభవించిన వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర దాగి ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ నాయకులు ఎదురుదాడి చేశారు. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో విఫలం కావడం వల్లే కేసీఆర్ ఈ కుట్ర ఆరోపణలు తెరపైకి తెచ్చారంటూ మండిపడుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కు, తమిళిసైకి అస్సలు పడడం లేదు.  ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కేసీఆర్ కు మరో కౌంటర్ ఇచ్చి తమిళిసై వార్తల్లో నిలిచారు. ఒకే రోజు ఒకే అంశం మీద.. గవర్నర్, సీఎం వేర్వేరుగా సమీక్షలను నిర్వహించడంతో ఈ విభేదాలు మరింత పతాకస్థాయికి చేరాయి.

ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రభుత్వ విప్ బాల్క్ సుమన్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడానికి గవర్నర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించేవారని.. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడడానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా? అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఇక బీజేపీ నేత ఈటలరాజేందర్ పై కూడా బాల్క సుమన్ మండిపడ్డారు. వార్డు మెంబర్ గా లేని ఈటలను మంత్రిగా చేసింది కేసీఆర్ యేనంటూ గుర్తు చేశారు.  ఈటల విశ్వాస ఘాతకుడు అని.. తిన్నింటి వాసాలను లెక్కబెట్టారంటూ మండిపడ్డారు. ఆరోగ్యమంత్రిగా.. ఆర్థిక మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు కమ్యూనలిస్టుగా మారాడని విమర్శించారు.

ఇక బాల్క సుమన్ కు, టీఆర్ఎస్ కు బీజేపీ నేతలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. క్లౌడ్ బరెస్ట్ గురించి చెప్పడానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా? అంటూ బాల్క సుమన్ ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. మరి మాట్లాడడానికి కేసీఆర్ ఏమైనా సైంటిస్ట్ నా? అంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ శాస్త్రవేత్తలా ఎందుకు క్లౌడ్ బరెస్ట్ పై వ్యాఖ్యలు చేశారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు లేని తెలివి.. గవర్నర్ కు ఉండొద్దా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా ఈ సైంటిస్ట్ లొల్లి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News