గుడివాడ అమర్నాథ్ మరీ ఇంత బ్యాడ్ టేస్ట్ ఏంది?

Update: 2022-11-13 04:35 GMT
ఏ మాట అనొచ్చు? ఎలాంటి మాట అనకూడదు? అన్నది లేకుండా.. మనసులోకి వచ్చిన మాటను నోటితో అనేయటం ఇటీవల కాలంలో తెలుగు రాజకీయాల్లో కనిపిస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ విపరీత ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతుంది. రాజకీయ నాయకుడ్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలే కానీ.. సంబంధం లేని మాటల్ని తెరమీదకు తీసుకొచ్చి.. నోరు పారేసుకోవటం అస్సలు మంచిది కాదంటున్నారు. ఇప్పటికే ఈ తీరు పెరిగి పెద్దదై.. భరించలేని స్థితికి వెళ్లిందని.. ఇప్పుడు మరింత హద్దులు దాటేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ టూర్ ను సూపర్ సక్సెస్ చేశామన్న భావనలో అధికార వైసీపీ ఉంది. బహిరంగ సభ కు భారీ ఎత్తున జనసమీకరణలో విజయం సాధించిన భావన జగన్ పార్టీ నేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ సభను సూపర్ సక్సెస్ చేశామన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే.. తమతో సరిసమానంగా మైలేజీ సొంతం చేసుకుంటున్న పవన్ మీద తనకున్న అక్కసును ప్రదర్శిస్తున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు ఏపీ అధికార పక్ష నేతలు.

తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయని అంటున్నారు. తమ గొప్పతనాన్ని తాము చెప్పుకోటం తప్పు కాదు. అదే సమయంలో సంబంధం లేని అంశాల్ని తీసుకొచ్చి కలిపితే లాభం కంటే నష్టమే ఎక్కువే అన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తిస్తున్నట్లు లేదు. ఇప్పటికే పవన్ కల్యాణ్ అన్నంతనే రెట్టించిన ఉత్సాహన్ని తెచ్చుకొని విరుచుకుపడే ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. తాను చేసే విమర్శలు.. వ్యాఖ్యలు శ్రుతి మించి రాగాన పడుతున్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిదంటున్నారు.

పవన్ చేసే తప్పుల్నితెలివిగా ఎత్తి చూపుతూ.. ఆత్మరక్షణలో పడేలా చేయాలే కానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ద్వారా పవన్ కు మేలు చేసి.. తనకు తాను కీడు చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ మీద కత్తి కట్టిన వైసీపీ నేతల్లో గుడివాడ అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇది సరిపోనట్లు.. తాజగా ఆయన చేసిన వ్యాఖ్యలు మంత్రిస్థాయికి ఏ మాత్రం సరిపోవంటున్నారు.

ఇప్పటివరకు దత్తపుత్రుడిగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు కొంతమేర సమర్థనీయమే అయినా.. తమ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ తో కలిసి రుషికొండ ను సందర్శించి.. అక్కడి భూమిని కబ్జా చేశారన్న ఆరోపణల్ని పరిశీలించిన వేళలో.. చిలుకా గోరింకలు రుషి కొండకు వెళ్లాయని పేర్కొనటం మాత్రం కచ్ఛితంగా బ్యాడ్ టేస్టుగా అభివర్ణిస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ప్రయోజనం కలిగించే కన్నా.. అమర్నాథ్ కు నష్టాన్ని కలిగిస్తాయని.. అనవసరంగానోరు పారేసుకోవటం ఎప్పటికి మంచిది కాదన్న హితవు పలుకుతున్నారు. పవన్ మీద చేసే ఈ తరహా వ్యాఖ్యలు ఆయనకు మరింత సానుభూతిని పెంచేలా చేస్తాయని.. అమర్నాథ్ లాంటోళ్ల మాటలు పవన్ కు లాభాన్ని.. సొంత పార్టీకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వింటన్నావా అమర్నాథ్?
Tags:    

Similar News