ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ట్విస్ట్ ఇచ్చారు. హైదరాబాదులో ఉన్న వాళ్లు అయితే హైదరాబాదీలు అవ్వాలి. లేకపోతే తెలంగాణ పౌరులు అవ్వాలి. సీమాంధ్రులు ఎట్లవుతారు? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బిగాల గణేష్ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇది ఉమ్మడి రాజధానే అయినా ఇక్కడ ఉన్న ప్రజలంతా తెలంగాణీయులే అవుతారని వారు వ్యాఖ్యానించారు.
ఇక్కడ ఉన్న వారి క్షేమం చూసే బాధ్యత ఇక్కడ ప్రభుత్వానిదే, ఈ మహా భాగ్యనగరంలో అన్ని ప్రాంతాల వారు హాయిగా జీవిస్తున్నారని, వారు తెలంగాణ ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారన్నారు. స్వచ్ఛ హైదరాబాదు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో వారు ఉత్సాహంగా పాల్గొంటున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడిగా తప్పు చేశాడు. దానిని తప్పించుకోవడానికి సీమాంధ్ర అనే వాదం తెరపైకి తెచ్చాడు. ఈ కేసులో తప్పు చేస్తే చంద్రబాబు పోరాడాలి గాని, సీమాంధ్రులకు ఏం సంబంధం అని వారు ప్రశ్నించారు. బాబు నిజంగా ఆ తప్పు చేయలేదనుకుంటే, వాయిస్ టెస్టుకు హాజరు కావాలని సవాల్ విసిరారు.